Etala Rajender: అన్ని విషయాలు బయటపెడతా.. ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Dec 13 , 2025 | 01:55 PM
తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చెబుతానని పేర్కొన్నారు.
హనుమకొండ, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పీఆర్వో (Bandi Sanjay Kumar PRO) సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (BJP Malkajgiri MP Etala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ ఎంపీనని... తాను కూడా కొన్ని పోస్టులను చూశానని ప్రస్తావించారు. అవగాహన లేకుండా కొంతమంది తనపై కుట్ర పూరితంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ(శనివారం) కమలాపూర్‌లో ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈటల రాజేందర్.
అలా పోస్టులు పెడతారా..?..
వాటిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. అవగాహన ఉన్నవారు అలా పోస్టులు పెడతారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తాను ఏ పార్టీలో ఉండాలో ప్రజలు తేల్చుకుంటారని చెప్పుకొచ్చారు. ఈ అంశాలను బీజేపీ హై కమాండ్ తేలుస్తుందని.. సమయమే ఇది డిసైడ్ చేస్తుందని వ్యాఖ్యానించారు. తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని అన్నారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ తాను చెబుతానని పేర్కొన్నారు ఈటల రాజేందర్.
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లని కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌పై ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఫలితాలను బట్టి అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. సింగరేణిలో క్వార్టర్స్ బాగుచేయడానికి పైసలు లేవా అని ప్రశ్నించారు. సింగరేణి డబ్బులతో తన ఫుట్‌బాల్ ట్రైనింగ్ కోసం సీఎం రేవంత్‌రెడ్డి వందల కోట్లు ఖర్చు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కోట్ల రూపాయలు దోపిడి చేశారని కవిత ఆరోపిస్తున్నారని అన్నారు ఈటల రాజేందర్.
కాంగ్రెస్ సర్కార్ పేదల ఇళ్లను కూలుస్తుందా..?
ఆరోపణలు వస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వల్లకాడులా మారే పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం పేదల ఇళ్లను కూలుస్తుందా?.. పెద్దల ఆస్తులను కాపాడుతుందా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గ్రామాల అభివృద్ధిలో తన వంతు సహకారం తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. తన స్వగ్రామం కమలాపూర్‌లో తనను తొక్కేయాలని చూశారని ఆరోపించారు. కొంతమంది తన గురించి మాట్లాడారని.. వాళ్లను ప్రజలు తొక్కేశారని విమర్శించారు. నిస్వార్థంతో పనిచేసే తమ అభ్యర్థులను గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈటల రాజేందర్.
సీఎం ఈవెంట్ మేనేజర్ లాగా మారారు..
సీఎం రేవంత్‌రెడ్డి ఈవెంట్ మేనేజర్ లాగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పైసలు లేకున్నా రేవంత్‌రెడ్డి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియాలో మేనేజ్ చేయడం తప్పా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేదని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్.
బీఆర్ఎస్ ప్రలోభాలు..
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టిన బీజేపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని చెప్పుకొచ్చారు. ఐదు గ్రామాల్లో స్వతంత్ర అభ్యర్థులకు తాము మద్దతు ఇచ్చామని.. వారు గెలిచారని తెలిపారు. గెలిచిన సర్పంచ్‌లకు రూ. 5 నుంచి రూ.10 లక్షలు ఇస్తామని బీఆర్ఎస్‌లోకి రావాలని చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతతో మొదటి విడతలో 50 శాతం సీట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. వాటిపై ఫోకస్
వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రూట్‌లో వెళ్లకండి..
Read Latest Telangana News and National News