Cyclone Montha: మొంథా తుఫాను.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:11 PM
మొంథా తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు. రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను (Cyclone Montha) నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) (Minister Seethakka) దిశానిర్దేశం చేశారు. తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అత్యావసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మొంథా తుఫానుపై ఆధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సీతక్క ఇవాళ(బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు.
మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో మంత్రి సీతక్క మాట్లాడారు. తుఫాను కారణంగా అధికారులు చేపట్టిన చర్యలపై మంత్రి సీతక్క తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. చలిగాలులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. పశువుల కాపరులు తమ పశువులని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు మంత్రి సీతక్క.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ప్రజలు వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయొద్దని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. పలు చోట్ల రైళ్లు నిలిచిపోయినట్లు సమాచారం అందుతున్న క్రమంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఆహారం, తాగునీరు వంటి అవసరాలు వెంటనే అందించాలని ఆదేశించారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి సీతక్క సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ, తెలంగాణకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు... ఐఎండీ హెచ్చరిక
ప్రయాణికుడి బ్యాగ్‌లో బుల్లెట్.. భద్రతా సిబ్బంది అలర్ట్
Read Latest Telangana News And Telugu News