Share News

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మి దూసుకెళ్లింది.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jul 26 , 2025 | 01:30 PM

దారి తెలియకపోవడంతో ఓ మహిళ గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ వెళ్లింది. అయితే మార్గ మధ్యలో ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. రోడ్డుపై వెళ్లాల్సిన కారు కాస్తా.. నీటి గుంటలో పడిపోయింది. చివరకు ఏమైందంటే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మి దూసుకెళ్లింది.. చివరకు ఏం జరిగిందంటే..

ఈ దారి ఎటు పోతుందండీ.. ఇది కొత్త ప్రదేశాలకు వెళ్లిన సందర్భాల్లో ప్రతి ఒక్కరి నుంచి వినిపించే మాట. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా అంతా గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ రయ్యిన దూసుకెళ్లిపోతున్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొందరికి షాకింగ్ అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అవుతూ చివరకు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, నవీ ముంబైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ వెళ్తున్న మహిళ.. చివరకు ఓ పెద్ద గుంతలో పడిపోయింది.


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని (Navi Mumbai)బేలాపూర్ నుంచి ఉల్వేకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళ శుక్రవారం నవీ ముంబై నుంచి ఉల్వేకు కారులో బయలుదేరింది. దారి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ వెళ్లింది. ఈ క్రమంలో ఆమె మార్గ మధ్యలో బేలాపూర్‌లోని వంతెన గుండా వెళ్లాల్సి ఉండగా.. గూగుల్ మ్యాప్ (Google Map) మరో దారి చూపించింది.


navi-mumbai.jpg

దాన్ని అనుసరిస్తూ వెళ్లగా కొన్ని నిముషాల (Car fell into pit) తర్వాత కారు నీటి వాగులోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న మెరైన్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మహిళను రక్షించి, గోతిలో నుంచి కారును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


గూగుల్ మ్యాప్‌‌ను అనుసరించి గతంలో చాలామంది ఇలాగే ప్రమాదాల బారిన పడడం చూశాం. గతంలో ముగ్గురు వ్యక్తులు బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని డేటాగంజ్‌కు వెళ్తుండగా.. మార్గమధ్యలో దెబ్బతిన్న వంతెన పైకి వెళ్లారు. ఈ క్రమంలో వారు 50 ఎత్తైన వంతెన పైనుంచి దిగువన ఉన్న నదిలో పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురూ మరణించారు. దీనిపై అప్పట్లో గూగుల్ కూడా స్పందించింది. ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. ఇకపై ఇలాంటివి జరగుకుండా సరిచేస్తామని పేర్కొంది. అలాగే హైదరాబాద్‌కు చెందిన నలుగురు పర్యాటకులు కేరళకు వెళ్తూ గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యారు. ఈ క్రమంలో వారు ఓ వాగులోకి దూసుకెళ్లారు. అయితే ఈ ఘటనలో వారు క్షేమంగా బయటపడ్డారు. ఇలా గూగుల్ మ్యాప్‌ను నమ్మి ఎంతో మంది ప్రమాదాలకు గురవడం పట్ల అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఇలాంటి యాప్‌లలో సమూల మార్పులు తీసుకురావాలని నిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - Jul 26 , 2025 | 01:30 PM