Road Accident: మా ఇంటికి ఫోన్ చేయండన్నా.. ప్రాణాలు పోయే ముందు బీటెక్ విద్యార్థిని వేడుకోలు..
ABN , Publish Date - Jul 26 , 2025 | 11:14 AM
కూతురికి కాలేజీకి టైం అవుతోంది. సమయానికి అందుబాటులో ఉన్న తండ్రి.. కూతురిని బైకుపై ఎక్కించుకుని బయలుదేరాడు. గమ్యస్థానికి చేరుకునేలోపే వారిపై విధి కన్నెర్ర చేసింది. దీంతో కాసేపట్లో కాలేజీ క్లాస్‌రూంలో అడుగుపెట్టాల్సిన యువతి.. తిరిగిరానిలోకాలకు చేరుకుంది.

అన్నా మా ఇంటికి ఫోన్ చేయండన్నా.. నన్ను కాపాడండి అన్నా.. ఇవి ప్రాణాలు పోయే ముందు బీటెక్ విద్యార్థిని ఆర్తనాదాలు. రోడ్డు ప్రమాదంలో లారీ టైర్ల మధ్యలో ఇరుక్కున్న ఆ యువతి.. నొప్పి భరించలేక విలవిల్లాడిపోయింది. తన కళ్ల ముందే తండ్రి మరణాన్ని చూసిన ఆమె.. కాసేపటికి తానూ తనువు చాలించింది. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ (Shadnagar) చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోట చేసుకుంది. కూతురికి కాలేజీకి టైం అవుతోంది. సమయానికి అందుబాటులో ఉన్న తండ్రి.. కూతురిని బైకుపై ఎక్కించుకుని బయలుదేరాడు. గమ్యస్థానికి చేరుకునేలోపే వారిపై విధి కన్నెర్ర చేసింది. దీంతో కాసేపట్లో కాలేజీ క్లాస్‌రూంలో అడుగుపెట్టాల్సిన యువతి.. తిరిగిరానిలోకాలకు చేరుకుంది.
షాద్‌నగర్‌కు చెందిన మచ్చేందర్ అనే వ్యక్తి.. బీటెక్ చదువుతున్న తన కూతురు మైత్రిని బైకుపై ఎక్కించుకుని కాలేజీకి బయలుదేరాడు. షాద్‌నగర్ చౌరస్తా వద్దకు రాగానే వీరి బైకును (Lorry hits bike) ట్యాంకర్ డీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన మచ్చేందర్.. అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి కూతురు మైత్రి లారీ టైర్ల మధ్యలో ఇరుక్కుపోయింది. తీవ్రగాయాలపాలైన ఆమె.. బయటికి రాలేక విలవిల్లాడిపోయింది. చుట్టూ గుమికూడిన వారిని చూసి.. కాపాడండి.. అన్నా.. అంటూ కేకలు పెట్టింది.
ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న ఆమె.. ఎలాగోలా తన ఫోన్ బయటికి తీసి అక్కడున్న వారికి ఇచ్చింది. మా ఇంటికి ఫోన్ చేయండి అన్నా.. అని కోరింది. ఇంతలో ఆమె ఫోన్‌కు ఫోన్లు రావడంతో స్థానికులు విషయం తెలియజేశారు. అయితే ఇంతలోనే మైత్రి కూడా తనువు చాలించింది. ప్రాణాలు పోయే ముందు ఆమె ఆర్తనాదాలు విని అంతా కంటతడి పెట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొట్టిన వాన.. రహదారులు జలమయం
ఇందిరమ్మ క్యాంటీన్లలో ఆగస్టు 15 నుంచి అల్పాహారం
Read Latest Telangana News and National News