Cyclone Montha On AP Govt:మొంథా తుఫాను నష్టాన్ని అంచనా వేస్తున్న ఏపీ ప్రభుత్వం
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:56 PM
మొంథా తుఫాను వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు.
అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను (Cyclone Montha) ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను కారణంగా చేతికి అందివచ్చిన పంట పాడైపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మొంథా తుఫాను వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) అంచనా వేస్తోంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu) ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఇవాళ(బుధవారం) కొనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రెండు రోజుల్లో అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో శరవేగంగా అధికారులు పంట నష్టంపై వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే, ప్రాథమిక అంచనాలు వచ్చాక కేంద్ర ప్రభుత్వానికి నివేదించనుంది ఏపీ ప్రభుత్వం. 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాను ప్రభావం ఉందని అధికారులు గుర్తించారు. మొంథా తుఫానుతో ఏపీలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని అధికారులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా దెబ్బతిన్న పంటలు
మొంథా తుఫానుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంట నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. జిల్లాలో పంటలు భారీగా దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. 10 వేల హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. 5 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం కలిగినట్లు అధికారులు గుర్తించారు. అలాగే, రెండు వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు నీట మునిగాయని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవి: మంత్రి సత్యకుమార్
మొంథా తుఫాను ప్రమాదం తప్పింది.. కానీ చాలా నష్టపోయాం..
Read Latest AP News And Telugu News