Bandi Sanjay: ఆ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Nov 07 , 2025 | 07:33 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించి చట్టం గురించి మాట్లాడితే మంచిదని సూచించారు బండి సంజయ్ .
హైదరాబాద్, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు అడిగితే.. ప్రైవేట్ కాలేజీ యజమాన్యాలని సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తారా..? అని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతినెలా బకాయిలు చెల్లిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. బకాయిలు చెల్లిస్తామని టోకెన్లు ఇచ్చి మోసం చేసింది నిజం కాదా? అని నిలదీశారు. బకాయిలు చెల్లించకుండా కాలేజీలను మోసం చేస్తోంది నిజం కాదా? అని ఫైర్ అయ్యారు. ఇవాళ(శుక్రవారం) బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్.
తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతే... మరి టోకెన్లు ఎందుకు ఇచ్చినట్లు? అని ప్రశ్నించారు. రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఎందుకు హామీ ఇచ్చారని నిలదీశారు. చట్టసభలో ఇచ్చిన హామీకే విలువ లేకుంటే ఇక అసెంబ్లీకి విలువ ఏముంది..? అని అడిగారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణ రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని రేవంత్‌రెడ్డే చెప్పారు కదా? అని గుర్తుచేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే కాలేజీలు ఎలా నడవాలి? అని నిలదీశారు బండి సంజయ్.
అధ్యాపకులకు జీతాలివ్వకపోతే విద్యార్థులకు చదవు చెప్పేదెవరు..? అని అడిగారు. కాలేజీ యాజమాన్యాలపై సీఎంకు ఉన్న కోపంతో.. విద్యార్థుల జీవితాలను బలి చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించి చట్టం గురించి మాట్లాడితే మంచిదని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగిస్తారా? ఎత్తి వేస్తారా? ప్రజలకు స్పష్టం చేయాలని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించేదాకా.. విద్యార్థులు, అధ్యాపకులు, కాలేజీ యాజమాన్యాల ఆందోళనకు బీజేపీ మద్దతు కొనసాగుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు
ప్రైవేటు విద్యాసంస్థలు తమాషా చేస్తే తాటతీస్తా.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News And Telugu News