Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 22 , 2025 | 09:59 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని కాంగ్రెస్ కేడర్‌కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కార్యకర్తలకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

నిజామాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై (Local Body Elections) మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC chief Mahesh Kumar Goud) తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదని అన్నారు. ఇవాళ(ఆదివారం) నిజామాబాద్ జిల్లాలో మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు మహేష్ కుమార్ గౌడ్.
ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని కేడర్‌కి మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కార్యకర్తలకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని అన్నారు. బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో నాసిరకం పనులు చేశారని ధ్వజమెత్తారు. జడ్జీలు, సినీ తారలు, బడా నాయకుల ఫోన్‌లు 650కు పైగా ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్‌దని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. దేశ చరిత్రలోనే అతి పెద్ద నేరం ఫోన్ ట్యాపింగ్ అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో భాగం పంచుకున్న ప్రతీ ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.
గాంధీ భవన్‌లో పలు కీలక సమావేశాలు
కాగా, రేపు(సోమవారం) గాంధీ భవన్‌లో పలు కీలక సమావేశాలు జరుగనున్నాయి. ముఖ్య అతిథులుగా ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు టీపీసీసీ డీలిమిటేషన్ కమిటీ సమావేశం జరుగనుంది. కమిటీ చైర్మన్ వంశీచంద్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జై బాపు, జై భీమ్ కో ఆర్డినేటర్ల సమావేశం, మధ్యాహ్నం 2 గంటల నుంచి టీపీసీసీ సంవిధాన్ బచావో సమావేశం, చైర్మన్ డా. వినయ్ అధ్యక్షతన సమావేశం, మధ్యాహ్నం 3గంటల నుంచి సంస్థాగత పరిశీలకుల సమావేశాలు జరుగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రన్‌వేపై విమానం.. ఆందోళనలో ప్రయాణికులు
అంబటి రాంబాబుపై మళ్లీ కేసులు నమోదు
For Telangana News And Telugu News