Share News

KTR: రేవంత్ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం.. కేటీఆర్ విసుర్లు

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:41 AM

KTR: రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శలు చేశారు.

KTR: రేవంత్ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం.. కేటీఆర్ విసుర్లు
KTR

హైదరాబాద్: పదేళ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు.. గ్రామస్వరాజ్యం కోసం జాతిపిత మహాత్మగాంధీ కన్నకలలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) వెల్లడించారు. ‘ఇవాళ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్న వేళ.. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్న... మహాత్మా గాంధీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పాలనలో ప్రాణంపోసిన ‘పల్లెప్రగతి’ని గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది’ అని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. సమైక్యపాలనలో దశాబ్దాలపాటు దగాపడ్డ పల్లెలను.. దర్జాగా కాలర్ ఎగరేసుకునే స్థాయికి తీర్చిదిద్దిన సందర్భాలు అపూర్వం, అనితర సాధ్యమని మాజీ మంత్రి కేటీఆర్ అభివర్ణించారు.


కేసీఆర్ హయాంలో ప్రతి పల్లెసీమ ప్రగతిసీమగా మారాయి...

సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ప్రతి పల్లె నాడు సకల సౌకర్యాల హరివిల్లైందని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ సంకల్పంతో ప్రతి పల్లెసీమ ప్రగతిసీమగా మారిందని కొనియాడారు. ప్రతి పల్లెలో డంప్ యార్డు తప్ప.. చెత్త కంపు లేని పరిస్థితి ఉందని చెప్పారు. కూలిపోయే స్థితి ఉన్న ఖాళీ ఇళ్ల కిరికిరి నుంచి పొంగిపొర్లే మురుగు కాల్వల శుభ్రత వరకూ ప్రతి సమస్యకు పదేళ్ల పాలనలో శాశ్వత పరిష్కారం చూపామని అన్నారు. కలుషిత నీటి కలకలం లేకుండా, సీజనల్ రోగాల చింతన లేకుండా సాగిన పంచాయతీల ప్రస్థానం గ్రామస్వరాజ్యంలో ఓ స్వర్ణయుగమని తెలిపారు. పచ్చదనానికి కొదవ లేకుండా, నిధులకు కొరత లేకుండా, విధులకు ఆటంకం లేకుండా, ప్రతి గ్రామాన్ని మెరుగైన జీవనానికి మారుపేరుగా మార్చారని.. ఇది కేసీఆర్ విజన్ అని మాజీ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు.


గ్రామాల్లో కనీస వసతులు కరువు...

దేశంలో మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణ, పల్లెప్రగతిలో 30 శాతం అవార్డులను గెలుచుకోవడం పల్లె ప్రగతిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి విజయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నాడు పదేళ్లపాటు మురిసిన పల్లె, కాంగ్రెస్ పాలనలో నేడు మళ్లీ కన్నీరు పెడుతోందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలనలో గ్రామస్వరాజ్యం పూర్తిగా గాడితప్పిందని విమర్శించారు. ఏడాదిన్నర గడిచినా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులు లేవని అన్నారు. గ్రామాల్లో కనీస వసతులు లేవన్నారు. పల్లెప్రజలకు గుక్కెడు మంచినీళ్లు దిక్కు లేవని చెప్పారు. చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు. ఉపాధి హామీ కూలీలకు పనిదినాలు లేవు, మాజీ సర్పంచ్‌ల బిల్లులకే మోక్షం లేదని అన్నారు. దేశంలోనే ఆదర్శ గ్రామాలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ పల్లెలు అధ్వాన పరిస్థితులకు అడ్రస్‌గా మారడం అత్యంత బాధాకరమని చెప్పుకొచ్చారు. ఢిల్లీ పార్టీలను నమ్మిన పాపానికి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన తీరును తెలంగాణ పల్లె ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీకి, పచ్చని పల్లెలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాతపెడతారని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Ponnam Prabhakar: భూ భారతి చట్టంతో రైతులకు న్యాయం

Karreguttalu Gunfight: కర్రెగుట్టలో కాల్పులు.. ముగ్గురు మావోలు మృతి

KTR: జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్‌

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 11:54 AM