Share News

Most Dangerous Road: ప్రపంచంలోనే ప్రమాదకరమైన రోడ్డు ఇదే.. ఏకంగా పది లక్షల మంది ఎముకలతో..

ABN , Publish Date - Apr 21 , 2025 | 07:58 PM

ఇప్పుడు మనం చెప్పుకోబోయే రోడ్డు కూడా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటి. ఈ రోడ్డు నిర్మించే సమయంలోనే ఏకంగా పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారట. ఎముకల రోడ్డుగా పేరుగాంచిన ఈ హైవే ఎక్కడుంది, దానికి ఆ పేరు ఎందుకొచ్చింది, అసలు రోడ్డు వెనుక ఉన్న చరిత్ర ఏంటీ.. తదితర ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Most Dangerous Road: ప్రపంచంలోనే ప్రమాదకరమైన రోడ్డు ఇదే.. ఏకంగా పది లక్షల మంది ఎముకలతో..

ప్రపంచంలో ప్రమాదకరమైన రోడ్లు చాలా ఉన్నాయి. కొన్ని ఎత్తైన కొండల మధ్యలో మెలికలు తిరుగుతూ ఉండగా.. మరికొన్ని మంచు తుఫానులు, విరిగిపడే కొండచరియలతో నిండిపోయి ఉంటాయి. అలాగే ఇంకొన్ని రోడ్లు నిర్వహణ సరిగ్గా లేక ప్రయాణికుల ప్రాణాలను బలిగొంటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రోడ్డు కూడా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటి. ఈ రోడ్డు నిర్మించే సమయంలోనే ఏకంగా పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారట. ఎముకల రోడ్డుగా పేరుగాంచిన ఈ హైవే ఎక్కడుంది, దానికి ఆ పేరు ఎందుకొచ్చింది, అసలు రోడ్డు వెనుక ఉన్న చరిత్ర ఏంటీ.. తదితర ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


రష్యాలోని (Russia) సైబీరియా తూర్పు భాగంలో మగడాన్, యాకుట్స్క్ నగరాలను కలిపే ప్రధాన రహదారి.. ప్రపంచంలోనే భయంకరమైన హైవేగా పేరుగాంచింది. కొలిమా హైవే (R504) అని పిలువబడే (Kolyma Highway) ఈ రోడ్డు ప్రపంచంలోనే అత్యంత శీతలమైన, కఠినమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది.

Most-Dangerous-Road.jpg


KOLIMA-ROAD.jpg

ఎముకల రోడ్డుగా ఎలా మారిందంటే..

ఈ రహదారిని 1930 నుంచి 1950 వరకూ నిర్మించారు. సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ పాలనలో ఈ రోడ్డును వేశారు. అప్పట్లో స్టాలిన్ శిబిరాల్లో ఖైదు చేయబడే వారిని ఈ రోడ్డు నిర్మాణంలో కూలీలుగా వాడుకున్నారట. బలవంతంగా పనులు చేయించడంతో పాటూ వారిని అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసేవారట. దీనికితోడు ఇక్కడ కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఖచ్చితమైన లెక్కలు లేకున్నా.. ఓ నివేదిక ప్రకారం ఈ రోడ్డు వేసే సమయంలో సుమారు 10 లక్షల మంది ఖైదీలు చనిపోయారని తెలిసింది. అలా చనిపోయిన వారి మృతదేహాలను రోడ్డు కిందే పూడ్చిపెట్టేవారు. దీనికితోడు శీతాకాలంలో రోడ్డు జారకుండా ఉండేందుకు మనిషి ఎముకలను ఇసుకతో కలిపి ఈ రోడ్డు నిర్మాణంలో ఉపయోగించారని సమాచారం. ఈ కారణంగానే ఈ రోడ్డుకు ఎముకల రోడ్డు అనే పేరు వచ్చిందని చెబుతున్నారు.


Kolyma-Highway.jpg

బంగారు గనుల్లోకి వెళ్లేందుకు..

కొలిమా హైవే నిర్మాణాన్ని 1932లో ప్రారంభించగా.. 1953లో పూర్తి చేశారు. ఈ రోడ్డును మొత్తం 2,025 కిలోమీటర్ల నిర్మించారు. కొలిమాలోని బంగారు గనులను చేరుకోవడానికి వీలుగా ఈ రోడ్డును నిర్మించారట. ప్రపంచంలోని అత్యంత శీతలమైన, కఠినమైన ప్రాంతాల్లో కొలిమా ప్రాంతం ఒకటి. ఈ ప్రాంతంలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -50°C కి పడిపోతాయట. దీనికితోడు భారీ హిమపాతం, గుంతల కారణంగా ఈ రోడ్డు ప్రమాదకరమైన మార్గాల్లో ఒకటిగా చేరింది. ఈ రోడ్డు చాలా వరకూ చదును చేయలేదు. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ రోడ్డు మీద ప్రయాణించడానికి 4 నుంచి 5 రోజుల సమయం పట్టవచ్చని సమాచారం.


వర్షాకాలంలో ఈ రోడ్డుపై ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మట్టితో కప్పబడిన ఈ రోడ్డులో ట్రాక్టర్లు, ట్రక్కులు వంటి వాహనాలు కూడా ఇరుక్కుపోగలవు. దీనికితోడు కొట్టుకుపోయిన వంతెనలు, వాగులు తదితరాలతో రోడ్డు మొత్తం అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాగే రోడ్డుపై భారీ మంచు, బురద ఉండడం వల్ల ప్రయాణం చాల కష్టంగా ఉంటుంది. మొత్తానికి స్టాలిన్ యుగంలో జరిగిన దురాగతాలకు ఈ రహదారి సాక్షంగా నిలిచింది.

Updated Date - Apr 21 , 2025 | 08:17 PM