Share News

Minister Venkata Reddy: స్థానిక ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 17 , 2025 | 01:54 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు.

Minister Venkata Reddy: స్థానిక ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Minister Komatireddy Venkata Reddy

నల్లగొండ, నవంబరు17 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkata Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో మిర్యాలగూడ ప్రజలు కాంగ్రెస్‌కి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఇవాళ(సోమవారం) మిర్యాలగూడలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటించారు. రూ.180.25 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రులు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు.


మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి సింగిల్ రోడ్డును, డబుల్ రోడ్డుగా చేస్తామని పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మిర్యాలగూడ కేఎన్ఎం డిగ్రీ కాలేజీని.. ప్రభుత్వ కాలేజీగా మార్చింది తామేనని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు. తెలంగాణలో మరో 15 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.


తెలంగాణలో మరో పదేళ్లు అధికారం మాదే:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (UttamKumar Reddy) వ్యాఖ్యానించారు. జిల్లా కార్యకర్తల త్యాగంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిపారు. తెలంగాణ చరిత్రలో నిలబడే విధంగా రూ.60 వేల కోట్లతో రోడ్లు ఏర్పాటు చేశామని వివరించారు.


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడలేని విధంగా ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం ఇస్తోందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశామని గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో మరో పదేళ్లు అధికారంలో ఉంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్‌.. సీవీ ఆనంద్ ఏమన్నారంటే..

షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు బంద్..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 17 , 2025 | 02:45 PM