Students Ragging: ర్యాగింగ్ కలకలం... పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు
ABN , Publish Date - Nov 18 , 2025 | 07:08 AM
శంషాబాద్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. సెకండ్ ఇయర్ విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కి పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్, నవంబరు18(ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థల్లో ర్యాగింగ్ (Ragging) పేరిట విద్యార్థులు (Students) శృతిమించిపోతున్నారు. ఇలాంటి ఘటనలు విద్యాసంస్థల్లో తరచూగా జరుగుతునే ఉన్నాయి. విద్యార్థుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలను కూడా అవకాశంగా తీసుకుని ర్యాగింగ్ పేరిట వేధింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల ర్యాగింగ్ పేరిట విద్యార్థులు రెచ్చిపోతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ర్యాగింగ్ హింసాత్మకంగా మారుతున్నాయి. ఇటీవల పలు విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా శంషాబాద్ (Shamshabad)లోని ఓ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కి పాల్పడ్డారు. ఈ సంఘటనతో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడుల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. హాస్టల్ విద్యార్థులపై డేస్ కాలర్ విద్యార్థులు స్థానిక గ్యాంగ్‌తో దాడికి యత్నించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సంఘటనతో కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే శంషాబాద్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఇరువురు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కళాశాల యాజమాన్యంతో పోలీసులు మాట్లాడారు. సీసీ కెమెరాల్లో విద్యార్థుల ఘర్షణ వీడియోలు రికార్డు అయ్యాయి. సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో ఫోటేజీలను గోప్యంగా ఉంచారు కాలేజీ నిర్వాహకులు.
కళాశాల వార్డెన్ పిల్లలకు సిగరేట్లు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కాలేజీకు ఏలాంటి అనుమతులు లేవని స్థానికులు చెబుతున్నారు. కళాశాలలో తరుచూ ఘర్షణలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలేజీలో జరిగే వాగ్వాదాలతో తాము చాలా భయపడిపోతున్నామని స్థానికులు అంటున్నారు. గతంలో ఇదే తరహాలో ర్యాగింగ్ కారణంగా ఇద్దరు విద్యార్థులకు టీసీ ఇచ్చినట్లు సమాచారం.
విద్యార్థుల మధ్య అసలు ఘర్షణ ఎందుకు వచ్చిందనే విషయంపై పోలీసులు అరాతీస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా చర్యలు చేపడుతామని పోలీసులు పేర్కొన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే విద్యార్థులతో పాటు సంబంధిత విద్యాసంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ పోలీసులు హెచ్చరించారు. కాలేజీలో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్.. సీవీ ఆనంద్ ఏమన్నారంటే..
షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు బంద్..
Read Latest Telangana News and National News