Mayor Vijayalakshmi: బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఆ విషయం తెలియదు.. మేయర్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 28 , 2025 | 07:14 PM
Mayor Gadwal Vijayalakshmi: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు తన గురించి తెలుసునని చెప్పారు. అక్రమంగా ఆస్తి సంపాదించాల్సిన అవసరం, ఖర్మా తనకు లేదని అన్నారు.

హైదరాబాద్: మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు ప్రతిపక్షాలకు హక్కు ఉందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. అవిశ్వాసానికి స్వాగతిస్తున్నానని చెప్పారు. ఏబీఎన్‌తో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడారు. అవిశ్వాసానికి ఎంతమంది కావాలో కూడా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు తెలియదని అన్నారు. పిబ్రవరి 11వ తేదీ వరకు తామే మేయర్, డిప్యూటీ మేయర్ అని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 11వ తేదీ తర్వాత అవిశ్వాసం పెట్టాలి అంటే ముందుగా కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీసియో సభ్యులు 98 మంది కలెక్టర్‌కు లెటర్ ఇవ్వాలని అన్నారు.
అదంతా అవ్వాలి అంటే మార్చి అవుతుందని చెప్పారు. ఈ నెల 30వ తేదీన జరిగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని అన్నారు. అందుకు అందరూ సహాకరించాలని చెప్పారు. ఇది ఎలక్షన్ ఇయర్.. అభివృద్ధిపై కార్పొరేటర్లు దృష్టి పెట్టాలని అన్నారు. గొడవలు చేసేందుకు కౌన్సిల్ వేదిక కాదని చెప్పారు. మళ్లీ కార్పొరేటర్‌గా తాను పోటీ చేయనని అన్నారు. మళ్లీ మేయర్ అయ్యే ఆలోచన తనకు లేదని తెలిపారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు తన గురించి తెలుసునని చెప్పారు. అక్రమంగా ఆస్తి సంపాదించాల్సిన అవసరం, ఖర్మా తనకు లేదని అన్నారు. బీఆర్ఎస్‌లో తాను ఉంటే చేయని ఆరోపణలు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసునని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.