Mallu Bhatti Vikramarka: దేశానికి ఆదర్శంగా తెలంగాణ: మల్లు భట్టి విక్రమార్క
ABN , Publish Date - Jul 26 , 2025 | 09:18 PM
దేశంలో మొదటిసారిగా, సమగ్రంగా కులగణన చేపట్టామని, దేశానికి ఆదర్శంగా నిలిచామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. పేద బతుకులు మారాలంటే విద్యను నిర్లక్ష్యం చేయొద్దని, బాగా చదివి తెలంగాణ, దేశ అభివృద్ధిలో భాగం అవ్వాలని మల్లు భట్టి విక్రమార్క సూచించారు.

హైదరాబాద్: చారిత్రాత్మకమైన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ మన రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. ఆలోచనలు ఏమైనా, భావజలాలు ఏమైనా స్వేచ్ఛగా వ్యక్తం చేయాలని, అన్ని హక్కుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వార్షికోత్సవాన్ని ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఇవాళ(శనివారం జులై 26) ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మల్లు భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. యుద్ధం చేసి సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా అనుభవించాల్సిన స్వేచ్ఛ జీవితాన్ని కోల్పోయామని తెలిపారు మల్లు భట్టి విక్రమార్క.
అలాగే పీపుల్స్ మార్చ్ సందర్భంగా ప్రజల సమస్యలను విన్నామని, కళ్లారా చూశామని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితులు మారాలని ప్రజా ప్రభుత్వంగా కలిసి ముందుకు వెళ్లాలని అనుకున్నామని, అది ఇప్పుడు తమ ప్రభుత్వంలో సాధించామని నొక్కిచెప్పారు. ఉన్నత విద్యను స్కిల్ బేస్డ్ నాలెడ్జ్ సెంటర్‌గా ప్రభుత్వ విశ్వ విద్యాలయాలను తయారు చేసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీనీ ఏర్పాటు చేశామని, అడ్వాన్స్ ట్రైనింగ్ సంస్థల ద్వారా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి యువతను ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విశ్వ విద్యాలయాల్లో అధ్యాపకుల నియామకం చేయబోతున్నామని చెప్పారు. ప్రతి బిడ్డకు ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి అంతర్జాతీయ భాషగా ఉన్న ఇంగ్లీష్ భాషలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు మల్లు భట్టి విక్రమార్క.
దేశంలో మొదటిసారిగా, సమగ్రంగా కులగణన చేపట్టామని, దేశానికి ఆదర్శంగా నిలిచామని మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. పేదల బతుకులు మారాలంటే విద్యను నిర్లక్ష్యం చేయొద్దని, బాగా చదివి తెలంగాణ, దేశ అభివృద్ధిలో భాగం అవ్వాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు అంశాలపై దృష్టిని కేంద్రీకరించిందని... ఒకటి విద్య, రెండు వైద్యం. రాష్ట్రంలో 104 యంగ్ ఇండియా స్పోర్ట్స్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. వీటి వల్ల తెలంగాణ ముఖ చిత్రం మారుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దేశానికి ఒక ఉన్నత ప్రధానమంత్రి అందించిన ఘనత ఈ విశ్వవిద్యాలయనిదని ఉద్ఘాటించారు. పబ్లిక్ యూనివర్సిటీల్లోని అన్ని బకాయిలను చెల్లిస్తున్నామని ప్రకటించారు. ఆడిటోరియం నిర్మాణం కోసం అవసరమైన చర్యలపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ చేసిన అంత్యాక్షరి కార్యక్రమం విద్యార్థులను ఉర్రూతలూగించాయి.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News