Share News

HarishRao: నిరుద్యోగ యువత పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు: హరీష్‌రావు

ABN , Publish Date - Jun 28 , 2025 | 02:58 PM

ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చిన గాంధీ కుటుంబం నిరుద్యోగ యువతి, యువకులకు హామీలు ఇచ్చి దారుణంగా మోసం చేశారని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. నిరుద్యోగులు వారి సమస్యలపై పోరాడాలని.. వారి న్యాయబద్ధమైన పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని హరీష్‌రావు మాటిచ్చారు.

HarishRao: నిరుద్యోగ యువత పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు: హరీష్‌రావు
BRS MLA HarishRao

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA HarishRao) ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని జూలై 4వ తేదీన ఛలో సచివాలయం సమ్మెకు నిరుద్యోగులు పిలుపునిచ్చారని తెలిపారు. నిరుద్యోగుల ఛలో సచివాలయం సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా హలో నిరుద్యోగి, ఛలో సెక్రటేరియట్ సమ్మె పోస్టర్‌ని హరీష్‌రావు ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. అనంతరం మీడియాతో హరీష్‌రావు మాట్లాడారు. నిరుద్యోగుల ఛలో సచివాలయం సమ్మెకి సీపీఎం పార్టీ మద్దతు ఇచ్చినట్లు నిరుద్యోగులు చెప్పారని పేర్కొన్నారు హరీష్‌రావు.


బీఆర్ఎస్ హయాంలో 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా మాజీ సీఎం కేసీఆర్ చొరవ తీసుకున్నారని హరీష్‌రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న జాబ్ క్యాలెండర్‌లో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం లేదని.. నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్ లెస్ క్యాలెండర్. ఇది దగా క్యాలెండర్ అని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ నిరుద్యోగులకు హామీ ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 వేల ఉద్యోగాలకు మించి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇందిరమ్మ మనమరాలుగా మాట ఇస్తున్నానని ప్రియాంకాగాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చారని గుర్తుచేశారు హరీష్‌రావు.


యూత్ డిక్లరేషన్‌‌లో చెప్పిన ఐదు అంశాలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ ఎందుకు నెరవేర్చలేదని హరీష్‌రావు ప్రశ్నించారు. స్కూటీ అంటే తనకు ఇష్టమని చెప్పిన ప్రియాంకాగాంధీ, మహిళ స్టూడెంట్స్‌కి ఇస్తామన్న స్కూటీ ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ చెప్పారని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్న నిరుద్యోగ భృతి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్‌లో ఐదు హామీలు ఇచ్చిన ప్రియాంకాగాంధీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు హరీష్‌రావు.


యూత్ డిక్లరేషన్ అమలు చేయనందుకు సీఎం రేవంత్‌రెడ్డిపైన ప్రియాంకాగాంధీ ఎందుకు మొట్టికాయలు వేయడం లేదని హరీష్‌రావు నిలదీశారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చిన గాంధీ కుటుంబం నిరుద్యోగ యువతి, యువకులకు హామీలు ఇచ్చి దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరాం, ఆకూనురి మురళీ, రియాజ్, ఆఖరికి ప్రియాంక గాంధీకి కూడా ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంటుందని స్పష్టం చేశారు. నిరుద్యోగులు వారి సమస్యలపై పోరాడాలని.. వారి న్యాయబద్ధమైన పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని మాటిచ్చారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి

దేశ రాజధానిలో బోనాల జాతర

యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 28 , 2025 | 03:21 PM