Share News

Harish Rao: కంచ గచ్చిబౌలి భూములపై సెబీ చైర్మన్‌కు హరీష్‌రావు ఫిర్యాదు

ABN , Publish Date - Jun 26 , 2025 | 09:17 PM

కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ సెబీ చైర్మన్‌కు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు, ఆధారాలతో సెబీకి గురువారం హరీష్‌రావు లేఖ రాశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పులు టీజీఐఐసీ ద్వారా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలను లేఖలో హరీష్‌రావు ఎండగట్టారు.

Harish Rao: కంచ గచ్చిబౌలి భూములపై సెబీ చైర్మన్‌కు హరీష్‌రావు ఫిర్యాదు
BRS MLA Harish Rao

హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూములను (Kancha Gachibowli Lands) తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ సెబీ (SEBI) చైర్మన్‌కు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA Harish Rao) ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు, ఆధారాలతో సెబీకి ఇవాళ(గురువారం) హరీష్‌రావు లేఖ రాశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పులు టీజీఐఐసీ (TGIIC) ద్వారా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలను లేఖలో ఎండగట్టారు. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ (Central Empower Committee) ప్రకారం ఈ భూమి అటవీ భూమిగా గుర్తించిందని, అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని లేఖలో హరీష్‌రావు ప్రస్తావించారు.


ఈ వాస్తవాలను దాచిపెట్టి, భూమిని తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమని హరీష్‌రావు తెలిపారు. టీజీఐఐసీ (TGIIC) వార్షిక ఆదాయం రూ.150 కోట్లు కన్నా తక్కువే అయినా వేల కోట్ల అప్పులు తీసుకోవడం ఆర్థిక అవకతవకలకు పాల్పడటంలో భాగమేనని హరీష్‌రావు అన్నారు. ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడంలో పారదర్శకత లేదు, సెబీ నియమ నిబంధనలు పాటించారన్న విషయంలోనూ స్పష్టత లేదని చెప్పారు. రుణ సేకరణ కోసం మధ్యవర్తులకు రూ. 169.83 కోట్లు బ్రోకరేజ్ చెల్లించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ అటవీ సంపదను తాకట్టు పెట్టి, అడ్డదారుల్లో రుణాలు సేకరించిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, ఆర్థిక అవకతవకలను బయటపెట్టాలని హరీష్‌రావు సెబీకి విజ్ఞప్తి చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సెబీ నిబంధనలను ఉల్లంఘించిందంటూ హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు.


హరీష్‌రావు లేఖలో ఇంకా ఏం చెప్పారంటే..

1.SEBI (Prohibition of Fraudulent and Unfair Trade Practices) Regulations, 2003 ప్రకారం భౌతిక వాస్తవాలను తప్పుగా చూపడం, మోసపూరితంగా దాచిపెట్టడం నేరం.

2.SEBI (Issue and Listing of Non-Convertible Securities) Regulations, 2021 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తప్పుడు నివేదికలు చూపుతూ సెబీనీ తప్పుదారి పట్టించే ప్రయత్నం.

3.SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ప్రకారం కంపెనీల నిర్మాణ మార్పులను, ఆర్థిక వివరాలను తప్పకుండా వెల్లడించాల్సిన బాధ్యత ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం టీజీఐఐసీ వెల్లడించకపోవడం.

4.SEBI (Merchant Bankers) Regulations, 1992 ప్రకారం మధ్యవర్తులు తగిన జాగ్రత్తలు తీసుకుని నిజాలను వివరించకపోవడం.

5.SEBI Act, 1992 సెక్షన్ 11(2)(i) ప్రకారం సెబీకి తప్పుడు సమాచారం, మోసపూరిత లావాదేవీలు చేయడం.

6.సెబీ (LODR) Regulations, 2015 సెక్షన్ 4(2)(e) ప్రకారం పెట్టుబడిదారులకు పూర్తి, స్పష్టమైన సమాచారం అందించడం తప్పనిసరి కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా వాస్తవాలను దాచిపెట్టడం.

7.కంపెనీల చట్టం (Companies Act, 2013) సెక్షన్ 13, 14 ప్రకారం ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడానికి సరైన విధివిధానాలు పాటించకపోవడం.

8.ఆర్థిక స్థితి, అప్పుల చెల్లింపు సామర్థ్యం గురించి సరైన వివరాలు వెల్లడించకపోవడం సెబీ చట్టంలోని సెక్షన్ 15A, 15HA ఉల్లంఘనే అని హరీష్‌రావు లేఖలో ప్రస్తావించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాకిస్థాన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన రక్షణ మంత్రి

నదిలో పడిన బస్సు.. ఒకరు మృతి.. ప్రయాణికులు గల్లంతు

For Telangana News And Telugu News

Updated Date - Jun 26 , 2025 | 09:25 PM