BJP MP Laxman: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 06:14 PM
కాళేశ్వరం కమిషన్ సీరియల్‌గా నడుస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏడాది కాలం నుంచి సాగదీస్తున్నారని విమర్శించారు. అసలు ఈ కేసులపై రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.

ఢిల్లీ: తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను రేవంత్ ప్రభుత్వం నిర్వహించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా రేవంత్ సర్కార్ చోద్యం చూస్తోందని విమర్శించారు. ఇవాళ(బుధవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. సర్పంచ్‌ల బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో సర్పంచ్‌లు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేశారని తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, తప్పించుకోవద్దని అన్నారు. పార్టీల పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రేవంత్‌రెడ్డి అనడం బీసీలను మోసం చేయడమేనని విమర్శించారు. కులగణన పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. తూతూమంత్రంగా బీసీ కులగణన చేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 2 వేల కోట్ల నిధులు ఆగిపోయాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 42 శాతం రిజర్వేషన్లపై రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. తెలంగాణ కులగణనలో 90 శాతం ముస్లింలను బీసీల్లో చేర్చి, నిజమైన బీసీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మకుండా చూడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల భూములను వెనక్కి అడుగుతున్న తెలంగాణ ప్రభుత్వం వాటిని అమ్మాలని భావిస్తుందా అని నిలదీశారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ భూముల అమ్మకాన్ని అడ్డుకొని తీరుతామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హెచ్చరించారు.
40 శాతం బీసీ కులగణన హైదరాబాద్‌లో జరగలేదని రేవంత్ ప్రభుత్వం చెబుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు 9వ షెడ్యూల్‌లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే పరిశీలిస్తుందని సూచించారు. కాళేశ్వరం కమిషన్ సీరియల్‌గా నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తి అయిందని గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్ తాను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి జరిగి ఉండొచ్చని.. తాను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏడాది కాలం నుంచి సాగదీస్తున్నారని విమర్శించారు. అసలు ఈ కేసులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేస్ కేసులను సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల
ఫోన్ ట్యాపింగ్ కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు
Read latest Telangana News And Telugu News