Oil Trade: మా ఆర్థిక వ్యవస్థను ఆపేయమంటారా? రష్యా చమురు కొనుగోలుపై భారత రాయబారి ఘాటు వ్యాఖ్యలు..
ABN , Publish Date - Jul 28 , 2025 | 10:45 AM
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలను బ్రిటన్‌లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి తిప్పికొట్టారు. ఏ దేశం కోసం మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా సమాధానమిచ్చారు.

లండన్: రష్యా నుంచి చమురు కొనుగోలు(Russia Oil Imports)పై పాశ్చాత్య దేశాల విమర్శలను బ్రిటన్‌లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి తోసిపుచ్చారు. ఏ దేశమూ అకస్మాత్తుగా తన ఆర్థిక వ్యవస్థను మూసివేయదని ఘాటుగా స్పందించారు. బ్రిటిష్ రేడియో స్టేషన్ టైమ్స్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో భారతదేశాన్ని ప్రశ్నిస్తున్న అనేక యూరోపియన్ దేశాలు వాళ్ల అవసరాల కోసం ఆ దేశాల నుంచే ఇంధనం, ఇతర వనరులు కొనుగోలు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా నుంచి ఇతర దేశాలు ఇంధనం కొనుగోలు చేయవద్దని పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి బ్రిటన్ రేడియో స్టేషన్ ‘టైమ్స్ రేడియో’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రష్యాతో భారత సంబంధాల గురించి చర్చకు వచ్చింది. ఇండియా చమురు అవసరాల్లో 80 శాతం రష్యానే తీరుస్తోందని ఆయన వెల్లడించారు. మా దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు మేం డిస్కౌంట్లలో కొనుగోలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. మరి, మేం ఏం చేయాలని మీ దేశాలు (పశ్చిమ దేశాలను ఉద్దేశిస్తూ) కోరుకుంటున్నాయి? మా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా స్విచ్ఛాఫ్ చేసుకోవాలా? అని ప్రశ్నించారు.
రష్యా, భారత్ మధ్య సంబంధం చమురుకే పరిమితం కాదని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి స్పష్టం చేశారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు భారతదేశానికి ఆయుధాలను విక్రయించలేదని.. కానీ న్యూఢిల్లీపై దండెత్తే పొరుగువారికి సరఫరా చేశాయని గుర్తుచేశారు. క్లిష్ట పరిస్థితుల్లో మాస్కో ఇండియాతో సత్సంబంధాలు కొనసాగించిందని అన్నారు.
భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. ఎప్పటినుంచో మధ్యప్రాచ్య దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తోంది. కానీ, ఉక్రెయిన్‌తో పోరు ఏళ్ల తరబడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు రష్యా భారీ తగ్గింపులో చమురు అమ్మకాలు ప్రారంభించింది. దీంతో ఉక్రెయిన్‌కు అండగా నిలబడుతున్న పాశ్చాత్య దేశాలు మాస్కో నుంచి చమురు దిగుమతి చేసే వారిపై మండిపడుతున్నాయి. చమురు, ఇతర వనరులేవీ దిగుమతి చేసుకోవద్దంటూ ఆంక్షలు విధించాయి. అయినా, ఇండియా చిరకాల మిత్రదేశంగా ఉన్న రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూనే ఉంది.
ఇవి కూడా చదవండి:
గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
యూరోపియన్ యూనియన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి