Tariff Cuts: ట్రంప్‌కు భయపడి కాదు.. ఇందువల్లే టారిఫ్‌లు తగ్గించాం.. భారత ప్రభుత్వం..
ABN , Publish Date - Mar 09 , 2025 | 02:24 PM
India Tariff Cuts:ఇండియా అగ్రరాజ్యంపై ఎంతైతే టారిఫ్ విధిస్తుందో మేమూ అంతే వసూలు చేస్తామని.. ఏప్రిల్ 2వ తేదీలోగా ఇది అమల్లోకి వస్తుందని బహిరంగంగానే హెచ్చరించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే, గడువు ముగియక ముందే భారత ప్రభుత్వం సుంకాల తగ్గింపుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. నా ఒత్తిడికి తలొగ్గే ఢిల్లీ ఈ నిర్ణయం తీసుకుందని ట్రంప్ ఇటీవల వరస వ్యాఖ్యలు చేస్తుండటంతో.. ఈ విషయంపై భారత ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది..

India Tariff cuts: ఏప్రిల్ 2 తర్వాత నుంచి భారతదేశం (India)పై పరస్పర సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గతంలోనే స్పష్టం చేశారు. ఇక గడువుకు ఇంకా నెల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉంది. అయితే, ఇంతలోపే అమెరికాపై సుంకాలను తగ్గించేందుకు సమ్మతిస్తున్నట్లు ఢిల్లీ ఇటీవలే ప్రకటించింది. దీంతో, ట్రంప్ నేను బహిరంగంగా ఈ అంశంపై చర్చించినందువల్లే ఒత్తిడికి తలొగ్గి భారత్ సుంకాల తగ్గింపుకు (Tariff Cuts)అంగీకరించిందని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో భారత ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై స్పందించారు. ట్రంప్ అభిప్రాయాన్ని పూర్తిగా కొట్టిపడేస్తున్నామని.. ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో భాగంగా.. సుంకాలను గణనీయంగా తగ్గించే చర్య చేపట్టామని స్పష్టం చేశారు.
ఇందుకే అమెరికాపై సుంకాలు తగ్గించాం..
ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకునేందుకే అమెరికాపై సుంకాల తగ్గింపు చర్యలు చేపట్టామే తప్ప.. ట్రంప్ ఒత్తిడికి భయపడి ఈ చర్యలు తీసుకోలేదని భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. గతంలో, భారతదేశం అనేక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కింద ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలకు సగటు వర్తించే సుంకాలను తగ్గించింది. యూరోపియన్ యూనియన్, UKతో కూడా ఇలాంటి ఒప్పందాల కోసం ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని ఉదహరించారు. అమెరికా అగ్రరాజ్యం అన్న కారణంతోనే తప్ప... ట్రంప్ విధిస్తానన్న ప్రతీకార సుంకాలకు భయపడి అయితే ఢిల్లీ ఈ నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ అధికారులు జాతీయ మీడియాతో చెప్పినట్లు తెలుస్తోంది.
అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కావడం వల్లే..
ప్రపంచంలో మరే దేశమూ లేని విధంగా భారత్ అమెరికాపై అత్యధిక సుంకాలు విధిస్తోందని.. ఇందుకు ప్రతీకారంగా తామూ అదే స్థాయిలో మేమూ వసూలు చేస్తామని గతంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇండియాను టారిఫ్ కింగ్‌గా అభివర్ణించారు. ఇండియా, భారత్ రెండు దేశాలకు ఏప్రిల్ 2వ తేదీని గడువుగా విధించారు. ఇదిలా ఉంటే, వ్యవసాయ ఉత్పత్తులు తప్ప దాదాపు అన్ని ఉత్పత్తులపై సుంకాలను తొలగించాలని అమెరికా భారతదేశాన్ని కోరిందని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి, అమెరికాకు భారత్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 118.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకుసాగుతోంది. ఈ సంవత్సరం చివరి నాటికి పరస్పరం ప్రయోజనకరమైన బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)మొదటి దశపై చర్చలు జరపడానికి గత నెలలో రెండు దేశాలు అంగీకరించాయి.
అగ్రరాజ్యం డిమాండ్‌కు అంగీకరిస్తే..
గత నెల ఫిబ్రవరి ప్రారంభంలో వాషింగ్టన్ పర్యటన సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య దీనిపై అంగీకారం కుదిరింది. మార్కెట్ యాక్సెస్ పెంపు, సుంకాలు, సుంకాలేతర అడ్డంకుల తొలగింపు, సరఫరా గొలుసు ఏకీకరణను మరింతగా పెంచడానికి ఇరుదేశాధినేతలు అంగీకరించారు. సీనియర్ ప్రతినిధులను నియమించి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం మార్చి 3 నుండి 6 వరకు వాషింగ్టన్‌ను సందర్శించింది. ఈ పర్యటనలో ప్రతినిధి బృందం అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్, వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్‌లతో చర్చలు జరిపింది. ఈ తరుణంలో అగ్రరాజ్యం చేస్తున్న డిమాండ్‌కు భారతదేశం అంగీకరిస్తే వాణిజ్యపరంగా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రతిఫలంగా పొందాల్సిన రాయితీలు దక్కవు.
Read Also : లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం
స్పిన్ లెజెండ్ మురళీధరన్‌కు కశ్మీర్‌లో ఫ్రీగా భూమి కేటాయించారా?
Gold Smuggling Case: కన్యారావు కేసులో బిగ్ ట్విస్ట్