Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పలు ప్రాంతాల్లో ఘర్షణలు
ABN , Publish Date - Nov 11 , 2025 | 10:43 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
హైదరాబాద్, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills BYE Election) ఇవాళ(మంగళవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే, పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలను ఆయా ప్రాంతాల నుంచి పంపించి వేశారు పోలీసులు.
బోరబండలో...
బోరబండలోని పలు పోలింగ్ స్టేషన్‌లలో తమ పార్టీ కార్యకర్తలపై స్థానిక కార్పొరేటర్, కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ దాడి చేశారని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఆరోపించారు. బీఆర్ఎస్ శ్రేణులపై బాబా ఫసియుద్దీన్ దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరును ఆమె ఖండించారు. అధికార కాంగ్రెస్‌కి మద్దతుగా పోలీసులు పనిచేస్తున్నారని మాగంటి సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు..
బోరబండలో పలు పోలింగ్ స్టేషన్ల వద్ద కరపత్రాలతో బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటోలతో ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు కాంగ్రెస్ నేతలు.
కాంగ్రెస్ నేతలకు మాగంటి సునీత వార్నింగ్...
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన, బెదిరించిన ఊరుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలను మాగంటి సునీత హెచ్చరించారు. పోలీసులు ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్‌గా ఉండి ఎన్నికలను సజావుగా జరిపించాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బాబా ఫసియుద్దీన్ దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని మాగంటి సునీత ప్రశ్నించారు.
షేక్‌పేట్ డివిజన్‌లో...
మరోవైపు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్‌లో ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి. షేక్‌పేట్ ప్రభుత్వ పాఠశాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ స్టేషన్‌లో ఏర్పాట్ల సరళిని మాగంటి సునీత పరిశీలించారు. అయితే, సునీతని పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులపై ఆమె మండిపడ్డారు. తనను బలవంతంగా షేక్‌పేట్ డివిజన్ నుంచి పంపిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మాగంటి సునీత, షేక్‌పేట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంగళరావు నగర్‌లో పర్యటించిన నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఈరోజు పలు పోలింగ్ కేంద్రాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ పర్యవేక్షించారు. అయితే వెంగళరావు నగర్ డివిజన్ బూత్ నెం 205, జవహర్‌నగర్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతూ స్థానిక కాంగ్రెస్ నేత అడ్డంగా దొరికారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ శ్రేణులు కోరారు. ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు కారు పార్టీ నేతలు.
రహమత్ నగర్‌లో..
రహమత్ నగర్‌లోని పలు పోలింగ్ స్టేషన్‌లని తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పరిశీలించారు. ఈ క్రమంలో పోలింగ్ స్టేషన్ల వద్ద స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఓటు లేని వ్యక్తులు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండకూడదని ఎన్నికల నిబంధనలు ఉన్న కూడా కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లను కాంగ్రెస్ నేతలు ప్రలోభ పెడుతున్నారని గులాబీ పార్టీ శ్రేణులు మండిపడ్డారు.
బీజేపీ నేతపై కాంగ్రెస్ నేత దాడి..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ యువమోర్చా(BJYM) షేక్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు స్వస్తిక్‌పై కాంగ్రెస్ నేత సాయినాథ్ అలియాస్ లడ్డుతో పాటు మరో నలుగురు కలిసి దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. పోలింగ్ రోజు బీజేపీ నేతలు బయట తిరగొద్దని తమని హెచ్చరిస్తూ సాయినాథ్ దాడికి దిగారని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. సాయినాథ్ దాడి చేయడంతో స్వస్తిక్ తీవ్రంగా గాయపడ్డారని కమలం పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో తనపై దాడి చేసిన కాంగ్రెస్ నేత సాయినాథ్, ఆయన అనుచరులపై ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని స్వస్తిక్ తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగకముందే కాంగ్రెస్ నేతలు రౌడీయిజానికి పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
Read Latest Telangana News And Telugu News