Ditwah Cyclone: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:17 PM
దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అధికారులు తెలిపారు. తుఫాను దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విశాఖపట్నం, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాన్ (Ditwah Cyclone) బలహినపడి.. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అధికారులు తెలిపారు. తుఫాను మరింతగా బలహనపడి వాయుగుండంగా మారుతోందని వెల్లడించారు. ఇది ప్రస్తుతం నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతాలను ఆనుకుని కొనసాగుతోందని వివరించారు.
ఈ వాయగుండం చైన్నై తీరానికి దగ్గరగా.. ఉత్తర దిశగా పయనిస్తోందని తెలిపారు. తుఫాను గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని చెప్పుకొచ్చారు. తుఫాను ప్రభావంతో రేపు (మంగళవారం) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. దిత్వా తుఫాను ప్రభావం దృష్ట్యా ప్రజలు సరైన జాగ్రత్తలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అధికారులు దిశానిర్దేశం చేశారు.
విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉంది: మంత్రి గొట్టిపాటి రవికుమార్

దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారని వివరించారు. ఎలాంటి ఇబ్బంది వచ్చిన ఆదుకునేందుకు విద్యుత్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ(సోమవారం)ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు.
ఇవి కూడా చదవండి...
పింఛన్ల పంపిణీలో ఏపీదే అగ్రస్థానం: సీఎం చంద్రబాబు
జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్థం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Read Latest AP News And Telugu News