Pawan Kalyan: కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
ABN , Publish Date - Nov 01 , 2025 | 02:31 PM
కాశీబుగ్గ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీబుగ్గ ఘటన తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
శ్రీకాకుళం, నవంబరు1 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి (Kasibugga Venkateswara Swamy Temple) ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మృతిచెందారు. మృతుల్లో 9 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్‌లోని స్వామివారి దర్శనం కోసం మెట్లు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. భక్తుల రద్దీతో రెయిలింగ్ ఊడిపడింది. ఈ క్రమంలో భక్తులు ఒకరిపై ఒకరూ పడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాశీబుగ్గ ఘటన తీవ్రంగా కలచివేసింది: పవన్ కల్యాణ్
కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీబుగ్గ ఘటన తీవ్రంగా కలచివేసిందని చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మృతుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని పేర్కొన్నారు. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు పవన్ కల్యాణ్.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులని ఆదేశించారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి తమ ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుందని భరోసా కల్పించారు. ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవదాయ శాఖ అధికారులని ఆదేశించారు. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
కాశీబుగ్గ ఘటన బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ప్రధాని. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా.. అలాగే, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు ప్రధాని మోదీ.
కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి: అమిత్ షా
అలాగే, కాశీబుగ్గ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు.
భక్తుల మరణం అత్యంత విషాదకరం: సీఎం చంద్రబాబు
శ్రీకాకుళం కాశీబుగ్గ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తుల మరణం అత్యంత విషాదకరమని చెప్పుకొచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రులని, అధికారులని ఆదేశించారు సీఎం చంద్రబాబు.
ఇవి కూడా చదవండి...
పదేపదే బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest AP News And Telugu News