Pawan Kalyan: కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ఫైర్
ABN , Publish Date - Aug 02 , 2025 | 07:36 PM
గత జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందినా సరైన విధంగా స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో రవాణా లేని ఏజెన్సీ ప్రాంతాలను రోడ్లతో కలుపుతున్నామని.. అక్కడ డోలీ మోతలు లేకుండా చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు.

అమరావతి: కూటమిలో ఉన్న మూడు పార్టీల్లోని నేతలు, కార్యకర్తలకు చిన్నచిన్న పొరపచ్చాలు ఉన్నా.. మీ స్ధాయిలోనే పరిష్కరించుకొని ముందుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సూచించారు. మన కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి వైసీపీ నేతలు (YSRCP Leaders) ఎంతో ప్రయత్నం చేస్తారని.. మనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అభివృద్ధిలో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ తిరిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని ఆకాంక్షించారు. కనీసం 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలని ఉద్ఘాటించారు. తమ ఈ ప్రయత్నం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని నొక్కిచెప్పారు. ఇవాళ(శనివారం ఆగస్టు 2) మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో పలు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు రోడ్లు వేయడమే కాదని.. ఇది భారత భవిష్యత్తుకు బలమైన పునాదని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ఈ దేశ ప్రగతికి చిహ్నాలు రవాణా మార్గాలని నొక్కిచెప్పారు. గోల్డెన్ క్వార్డలేటర్ ద్వారా రహదారులు దేశ దశదిశను దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయి మార్చారని కొనియాడారు. భారతదేశం ఎదుగుదలకు అసలైన బలం మౌలిక వసతులని.. దీనికి ప్రధాన కారణం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అని ఉద్ఘాటించారు. 2014లో దేశంలో జాతీయ రహదారులు 91 వేల కిలోమీటర్లు ఉండగా.. ఇప్పుడు లక్షా 40వేల కిలోమీటర్లకు చేరిందని చెప్పుకొచ్చారు. నిర్మాణ వేగం మూడు రెట్లు, బడ్జెట్ ఆరురెట్లు పెరిగిందని వివరించారు. అందుకే గడ్కరీని హైవే మ్యాన్ ఆప్ ఇండియాగా పిలుస్తారని ప్రశంసించారు పవన్ కల్యాణ్.
గత జగన్ ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం నుంచి సహకారం వచ్చినా సరైన విధంగా స్పందించలేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.550కోట్లు ఇస్తే ఏపీ ప్రభుత్వం రూ.50కోట్లు ఇచ్చి రోడ్లు వేశామని వెల్లడించారు. రవాణా లేని ఏజెన్సీ ప్రాంతాలను రోడ్లతో కలుపుతున్నామని.. అక్కడ డోలీ మోతలు లేకుండా చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.50 కోట్లు ఇవ్వడంతో రూ.1000 కోట్లతో రోడ్లు వేయగలిగామని చెప్పుకొచ్చారు. అటవీ అనుమతులతోనే రోడ్లకు ప్రణాళికలు వేసి ముందుకు తీసుకెళ్తున్నామని ఉద్ఘాటించారు. గత జగన్ ప్రభుత్వాన్ని చూశామని.. కూల్చివేతలతో ఆ ప్రభుత్వం మొదలైందని.. కనీసం రోడ్లు కూడా వేయలేదని, రహదారులపై గుంతలు పూడ్చలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు రహదారులు, హైవేలు నిర్మిస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్‌బాస్ అరెస్ట్ ఖాయం
Read Latest AP News and National News