CM Chandrababu: పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్
ABN , Publish Date - Oct 31 , 2025 | 08:13 PM
టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
అమరావతి, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాల (TDP Thiruvur)పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదని హెచ్చరించారు. తిరువూరు విభేదాలకి కారణమైన ఇరువురు నేతలు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులతో తాను కూడా మాట్లాడుతానని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
చర్యలు తప్పవు..
ఆ తర్వాత కూడా పరిస్థితి చక్కబడకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఈ విషయాన్ని ఇరువురు నేతలకి చెప్పాలని సూచించారు. ఇవాళ(శుక్రవారం) టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై అధినేత చర్చించారు. అనంతరం పార్టీ నేతలతో తిరువూరు విభేదాల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో తిరువూరు వివాదాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు సీఎం చంద్రబాబు.
వైసీపీ ఫేక్ ప్రచారంపై...
ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులని పిలిపించి మాట్లాడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇరువురు అభిప్రాయాలను ఓ లేఖ రూపంలో తనకు ఇవ్వాలని ఆదేశించారు. తాను లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఇరువురిని పిలిపించి మాట్లాడుతానని అధినేత స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ నెగెటివ్, ఫేక్ ప్రచారం చేస్తోందని చంద్రబాబు దృష్టికి పార్టీ నేతలు తీసుకువచ్చారు. ఈ విషయంపై నిజాలు ఏమిటో ప్రజలకు టీడీపీ శ్రేణులు వివరించాలని చెప్పారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు సోషల్ మీడియాపై అవగాహన ఉన్నవారిని తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే, వచ్చే వారం తర్వాత నుంచి వారంలో ఒకరోజు మొత్తం టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు.
అప్పుడే టీడీపీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీల నియామకం..
కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇవ్వడం లేదని సీఎంకు పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బంది చెప్పారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం. అంత తీరిక లేకుండా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేల జాబితా తయారు చేసి తనకు టెలికాన్ఫరెన్స్‌లో అందరిని కలపాలని ఆజ్ఞాపించారు. తన లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే టీడీపీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలను నియమిస్తామని చెప్పుకొచ్చారు. జాబితాలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని తీసుకొని రావాలని టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై తాను ఒక గంట సమయం కేటాయిస్తే చాలని చెప్పుకొచ్చారు. మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఎమ్మెల్యేలు నవంబరు 2వ తేదీన మళ్లీ వెళ్లాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పంటల నష్టం అంచనా సరిగా జరిగిందా..? ..లేదా..? అనే అంశంపై టీడీపీ నేతలు అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
క్రమశిక్షణ పాటించాలి..
‘పార్టీ కేడర్, ఎమ్మెల్యేలు క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంది. పార్టీ కేడర్‌కు క్షేత్రస్థాయిలో వాస్తవాలు బాగా తెలుస్తాయి. పార్టీ సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టిక్కెట్ ఇవ్వడం పొరపాటు. ప్రస్తుతం జరుగుతున్న గొడవలకు ఇదే ప్రధాన కారణమేమోనని అనిపిస్తోంది. పార్టీ టికెట్‌పై గెలిచిన వాళ్లు పార్టీ లైన్ తీసుకోవాలి. వ్యక్తిగత ఇమేజ్ కోసం కొందరు పాకులాడుతున్నారు. అందరూ వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తే వాళ్లు వెళ్లి వ్యక్తిగతంగా పోటీ చేస్తే బాగుంటుంది. ఎవరూ రిలీజియస్ సెంటిమెంట్లను టచ్ చేయొద్దు. ఒక ఎమ్మెల్యేగా ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పార్టీ కేడర్ ఎంపవర్‌మెంట్‌పై పూర్తి స్థాయి చర్చ ఉంది. వాళ్లకు ఎటువంటి శిక్షణ ఇవ్వాలనే అంశంపై చర్చించాం. రాజకీయం డబ్బులు సంపాదించడం కోసం అనే భావన నుంచి నేతలు బయటకు రావాలి’ అని సూచించారు సీఎం చంద్రబాబు.
సంపాదనకు వేరే మార్గాలు చూసుకోవాలి...
‘సంపాదనకు వేరే మార్గాలు చూసుకోవాలి. కొంతమంది లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం ద్వారా వచ్చే డబ్బు ఎప్పుడూ నిలబడదు. కల్తీ మద్యం వ్యాపారం చేశారు.. వాళ్లకు ఇప్పుడు మరకలు అంటుకున్నాయి. జగన్‌కు బురద చల్లడం బాగా అలవాటైంది. కోడికత్తి, గులకరాయి, వివేక హత్య కేసులో వాళ్ల మనుషులు ఉన్నారు. ఇది అతని నైజం, కానీ బురద మనమీద వేస్తున్నారు... ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలు, క్యాడర్ కూడా దీర్ఘ కాలంగా కూటమి అధికారంలో ఉండాలి. రెండు, మూడు టర్మ్‌లు ఒకే ప్రభుత్వం ఉంటే ప్రజలకు మంచి ఫలాలు అందుతాయి’ అని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
ఏపీలో ఆర్థిక విధ్వంసం
‘2019 తర్వాత మనం అధికారంలోకి రాకపోవడంతో ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగింది. వ్యవస్థలు అన్ని కుప్పకూలాయి. గ్రామ సచివాలయాలు పేరు తీసివేసి స్వర్ణాంధ్ర సెంటర్లని పెడితే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించాం. నేను ఇంకా వారానికి ఒక్కసారి పార్టీ ఆఫీస్‌కు వస్తాను. మంత్రి నారా లోకేశ్ కూడా ఒకరోజు వస్తారు. నాకు ఇక్కడికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. పార్టీ వాళ్లను పెన్షన్లు ఇచ్చేటపుడు వెళ్లమని ఆదేశించా. ఎన్నికల ముందు రూ.4వేల పెన్షన్ ఇస్తామని చెప్పాను. అందుకనే నేను పార్టీ వాళ్లను సచివాలయ సిబ్బందితో వెళ్లి పక్కన నుంచొని ఉండమని చెప్పాను. పార్టీ ఓనర్ షిప్ తీసుకోవాలి. పార్టీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు. ఎప్పుడు అధికారంలో ఉంటుంది’ అని ధీమా వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.
యూకేకు సీఎం చంద్రబాబు దంపతులు...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు వారి వ్యక్తిగత పర్యటనలో భాగంగా యూకేకు వెళ్లనున్నారు. రేపు(శనివారం) రాత్రి తన సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ వెళ్లనున్నారు సీఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ -2025కు ఎంపికయ్యారు భువనేశ్వరి. ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్సులో హెరిటేజ్ ఫుడ్స్ గోల్డెన్ పీకాక్ అవార్డుని ఆమె అందుకోనున్నారు. లండన్‌లో 4 తేదీన జరిగే రెండు అవార్డుల కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మొంథా తుఫానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి: పవన్ కల్యాణ్
టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం
Read Latest AP News And Telugu News