YV Subba Reddy: శ్రీవారి విషయంలో ఏ తప్పు చేయలేదు.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:02 PM
శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఢిల్లీ, నవంబరు27 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆస్తులపై తాము శ్వేతపత్రం విడుదల చేశామని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డూ విషయంలో తనను సిట్ విచారణ చేస్తే కూడా ఇవే అంశాలు చెప్పానని గుర్తుచేశారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూపై పాలీగ్రాఫ్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇవాళ(గురువారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు వైవీ సుబ్బారెడ్డి. 2014 నుంచి 2019 వరకు మాత్రమే నెయ్యిపై ఎందుకు విచారణ చేస్తున్నారని... అంతకుముందు కూడా విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయాలకు ఆలయాలను వాడుకుంటున్నారని ఆరోపణలు చేశారు వైవీ సుబ్బారెడ్డి.
ఏ తప్పు చేయలేదు..
స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. 30 సార్లు తాను అయ్యప్ప మాల వేసుకున్నానని గుర్తుచేశారు. తనపై తప్పుడు నిందలు వేస్తున్నారని ఆరోపించారు. లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ అంశంగా మార్చారని విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడంతో సుప్రీంకోర్టులో కేసు వేశానని గుర్తుచేశారు. తాను తప్పు చేస్తే ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి.
మీడియాలో కథనాలు దురదృష్టకరం..
‘లడ్డూ ప్రసాదంలో కలిసింది.. జంతువుల కొవ్వా.. లేదా వెజిటెబుల్ ఆయిలా అనేది ఇప్పటివరకు స్పష్టత రాలేదు. నెయ్యి ట్యాంకర్లు పరిశీలించిన తర్వాతే లడ్డూ తయారీకి నెయ్యిని వినియోగించాం. ల్యాబ్ టెస్టులు జరిగినప్పుడు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఎలా కలిసింది. 2019 నుంచి 2024 మధ్య కల్తీ నెయ్యితో లడ్డూల తయారీ జరిగిందని తప్పుడు ప్రచారం జరుగుతుంది. సిట్ దర్యాప్తు జరుగుతుంటే ..కల్తీ నెయ్యితో లడ్డూల తయారీ జరిగిందని మీడియాలో కథనాలు దురదృష్టకరం. మీడియా సంయమనం పాటించాలి’ అని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.
సిట్ దర్యాప్తు సమగ్రంగా జరగాలి..
‘కిలో నెయ్యి రూ.326లకు కొనుగోలు చేశాం. తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ప్రచారం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోళ్లు, కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు సమగ్రంగా జరగాలి. టీటీడీ ద్వారా లాభ పడాలని నాకు, నా కుటుంబానికి లేదు. శ్రీనివాస సేతు నిర్మాణంలో రూ.50 నుంచి 70 కోట్ల వరకు నిర్మాణ వ్యయం తగ్గించాం. శ్రీవారి ఆదాయాన్ని కాపాడినా మా పై నిందలు వేస్తున్నారు. L1, L2 దర్శనాలు రద్దు చేశాం. పారదర్శకంగా ఉండేందుకు శ్రీవాణి దర్శనం తెచ్చాం. తిరుమలలో ప్లాస్టిక్ సంపూర్ణంగా నిషేధించాం. 516 గోశాలలకు ఆర్థిక సహాయం చేశాం. పద్మావతి హృదయాలయం ఆస్పత్రి స్థాపించాం’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
సీఐడీ విచారణకు హాజరవుతా..
‘పరకామణి విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. పరకామణిలో దొంగతనం జరిగిందని.. సీఐడీ విచారణకు రమ్మని చెప్పారు. పరకామణి అంశంలో రేపు (శుక్రవారం) విజయవాడలో సీఐడీ విచారణకు హాజరవుతాను. అప్పన్న గతంలో నా పీఏ మాత్రమే... ఆ తర్వాత ఆయన నాతో లేరు. టీటీడీ వ్యవహారంలో అప్పన్నకు సంబంధం లేదు. అదే అంశాన్ని సిట్‌కు చెప్పాను . తిరుమలలో అప్పన్న దర్శనానికి వస్తే వచ్చారేమో కానీ నాకు తెలియదు’ అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
For More AP News And Telugu News