Konda Surekha: గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం
ABN , Publish Date - Jun 16 , 2025 | 02:50 PM
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.

వరంగల్: తెలంగాణలో నిర్వహించే గోదావరి పుష్కరాలపై (Godavari Pushkaralu) కేంద్రప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ఆరోపించారు. గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. కేంద్రప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను సమానంగా చూడాలని కోరారు. దేవాదాయ శాఖ మంత్రిగా నిధుల కేటాయింపుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాస్తానని తెలిపారు. ఇవాళ(సోమవారం) వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు.
ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారదాదేవి, మేయర్ గుండు సుధారాణి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తట్టెడు మట్టి కూడా పోయలేదని మంత్రి కొండా సురేఖ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భూ కబ్జాదారులే గతంలో పరిపాలన చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. పేదల కలలు సాకారం కావాలంటే ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News