Minister Vivek Venkata Swamy: కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం నిర్మించారు.. కేసీఆర్‌పై మంత్రి వివేక్ ధ్వజం
ABN , Publish Date - Aug 03 , 2025 | 06:56 PM
కాంట్రాక్టర్లను ధనికులను చేయడానికి మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని మంత్రి వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. జస్టిస్ పీసీ గోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు.

సిద్దిపేట జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) రిపోర్ట్ వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి (Minister Vivek Venkata Swamy) హెచ్చరించారు. జస్టిస్ పీసీ గోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణలో సాగునీటి కోసమని రూ.36 వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల నిర్మించామని ఉద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కమీషన్‌ల కోసమే ఈ ప్రాజెక్టును కాళేశ్వరంలో కలిపారని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకట స్వామి.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు ఖర్చు చేశారని ఆక్షేపించారు. ఇప్పటివరకు కాళేశ్వరం నుంచి 70 టీఎంసీల పంపు చేసిన నీళ్లు కూడా వృథా అయ్యాయని విమర్శించారు. ఇవాళ (ఆదివారం) గజ్వేల్ నియోజకవర్గంలో రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకట స్వామి పాల్గొని మాట్లాడారు. కేవలం కాంట్రాక్టర్లను ధనికులను చేయడానికి మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించిందని ఆరోపించారు. మల్లన్నసాగర్‌కు ఎల్లంపల్లి నుంచి నీరు వస్తోందని.. ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలో నిర్మించామని గుర్తుచేశారు. గతంలో 15 లక్షల ఎకరాలకు ఎల్లంపల్లి నుంచి సాగు నీరు వచ్చేదని.. అలాంటి ఎల్లంపల్లి ప్రాజెక్టును కాళేశ్వరంలో కలిపారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంపింగ్ ఫెయిల్ అయిందని మండిపడ్డారు. వంద మీటర్లు పంపింగ్ చేయాలంటే రూ.4 వేల కోట్లు అవసరని వెల్లడించారు మంత్రి వివేక్ వెంకట స్వామి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం
‘ఒక్క రేషన్ కార్డు ద్వారా ఎంతమంది ఏ ఏ స్కీములు తీసుకున్నారో తెలుస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించాం. కాంగ్రెస్‌ను ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. 10 వేల ఇళ్లు సిద్దిపేట జిల్లాకు అమలు అయ్యాయి. గజ్వేల్ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తాం. మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. సిద్దిపేట జిల్లాలో 2 లక్షల మందికి 200 యూనిట్‌ల విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నాం, రూ. 12 వేల కోట్లతో సన్నబియ్యం ఇస్తున్నాం. రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ. 10 లక్షల వరకు పెంచాం. సుమారు రూ.9 వేల కోట్లతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాం. సిద్దిపేట జిల్లాలో రూ.36 కోట్లతో స్కూళ్ల మరమ్మతు చేశాం. సిద్దిపేట జిల్లాలో 3967 నూతన రేషన్ కార్డులు అందజేస్తున్నాం. 88 వేల మంది రైతులకు సుమారు రూ.100 కోట్లు రైతు భరోసా, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. సుమారు 41 వేల మందికి గ్యాస్ స్కీమ్ అమలు చేశాం’ అని మంత్రి వివేక్ వెంకట స్వామి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు కొత్త చరిత్రను సృష్టించాయి: వెంకయ్యనాయుడు
కవిత గురించి మాట్లాడటం వృథా.. జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News