Share News

Harish Rao: స్థానిక ఎన్నికలపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 21 , 2025 | 03:02 PM

రేవంత్ ప్రభుత్వం అన్నదాతలని ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీమంత్రి హరీష్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌లోకి కాళేశ్వరం నీళ్లు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు.

Harish Rao:  స్థానిక ఎన్నికలపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు
Harish Rao

సిద్దిపేట: స్థానిక ఎన్నికల్లో (Local Elections) గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలపై ఈ మధ్య సర్వే చేయిస్తే.. తెలంగాణలో మొత్తం 31 జిల్లా పరిషత్‌లు ఉంటే.. 16 నుంచి 18 స్థానాలని బీఆర్‌ఎస్ కైవసం చేసుకోబోతోందని ఆ సర్వేలో తేలిందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ని ఓడించాలని పిలుపునిచ్చారు.  ఇవాళ(సోమవారం) ప్రజ్ఞాపూర్‌లో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్‌రావు పాల్గొని బీఆర్ఎస్ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గజ్వేల్‌ అని ఉద్ఘాటించారు.


రేవంత్ ప్రభుత్వం అన్నదాతలని ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీమంత్రి హరీష్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఎరువులకు లైన్‌లో నిలబడ్డ దాఖలాలు లేవని.. రేవంత్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎకరానికి ఒకటే బ్యాగ్ అంటున్నారని... మళ్లీ లైన్లలో నిలబడే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌లోకి కాళేశ్వరం నీళ్లు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. కేసీఆర్ హయాంలో మోటార్లు కాలకపోయేవని.. ఇప్పుడు మోటార్ వెండింగ్ దుకాణాలకు గిరాకీ పెరిగిందని విమర్శించారు. ఆనాడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు భూమి కొనవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్ పాలనలో తెలంగాణలో రెండు ఎకరాలు అమ్మితే ఆంధ్రాలో ఒక ఎకరం కొనే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీమంత్రి హరీష్‌రావు.  


20 నెలల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ పరిస్థితి ఏవిధంగా ఉందో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పుకొచ్చారు. ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి కనపడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని.. కానీ 12 వేల ఉద్యోగాలు ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని ఉద్ఘాటించారు. నిరుద్యోగులు ఎక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారోనని వందలాది మంది పోలీసులతో తిరుగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 వేల పెన్షన్‌లు ఇస్తామని చెప్పి.. 2 లక్షల పెన్షన్ లు తీసేశారని ఫైర్ అయ్యారు. రేవంత్ ప్రభుత్వంలో కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదని... ఇరవై నెలల్లో రెండు నెలల పెన్షన్‌లు ఎగ్గొట్టారని హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 05:32 PM