Harish Rao: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై స్పందించిన హరీష్‌రావు
ABN , Publish Date - Jun 21 , 2025 | 02:53 PM
రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా వన్ రేస్‌ని రాష్ట్రానికి తెచ్చిన మాజీ మంత్రి కేటీఆర్‌ని కూడా రేవంత్ ప్రభుత్వం సతాయించిందని హరీష్‌రావు అన్నారు.

సంగారెడ్డి జిల్లా: గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని (BRS MLA Padi Kaushik Reddy) సుబేదారి పోలీసులు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి వరంగల్‌కు తీసుకువచ్చారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA Harish Rao) స్పందించారు. కౌశిక్‌రెడ్డిపై పగతో దొంగ కేసు పెట్టి శనివారం చూసి అరెస్టు చేశారని మండిపడ్డారు. శనివారం, ఆదివారం అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా లెక్కజేయకుండా కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్‌రావు.
ఫార్ములా వన్ రేస్‌ని రాష్ట్రానికి తెచ్చిన మాజీ మంత్రి కేటీఆర్‌ని కూడా రేవంత్ ప్రభుత్వం సతాయించిందని హరీష్‌రావు అన్నారు. రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటే రేవంత్‌కి భయం... నిద్రలో కూడా కేసీఆర్ పేరు తలచుకొని భయపడుతున్నారని విమర్శించారు. సీఎం కుర్చీకి ఉన్నా విలువను కూడా రేవంత్‌రెడ్డి తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(శనివారం) జిన్నారంలో పటాన్‌చెరు నియోజకవర్గ రైతులకు వెంటనే రైతు భరోసా ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో హరీష్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మానిక్‌రావు , ఎమ్మెల్సీ యాదవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు.
రైతులపై రేవంత్‌రెడ్డికి పగ..
‘ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. కోతల రేవంత్‌రెడ్డి. రైతు అయితే చాలు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. రేవంత్‌రెడ్డి ఓఆర్ఆర్ లోపల ఉన్నా రెండు లక్షల ఎకరాలకు రైతుబంధు ఇవ్వట్లేదు. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల రైతులపై రేవంత్‌రెడ్డి పగ పెంచుకున్నారు.. వారికి ఎందుకు రైతుబంధు ఇవ్వట్లేదు. సాగులో ఉన్న భూములకు రైతుబంధు ఎందుకు ఇవ్వరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో లక్ష మందికి పెన్షన్లు తొలగించారు. అన్ని ఎగ్గొడుతున్నందుకే ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటాం. కేసీఆర్ హయాంలో నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే... రేవంత్‌రెడ్డి మాత్రం ఓట్లకు ఓట్లకు మధ్య ఇస్తున్నారు. ఒక్కో రైతుకు రేవంత్‌రెడ్డి రూ. 12 వేల రైతు భరోసా బాకీ పడ్డారు. ఓట్ల కోసం ఇప్పుడు రైతు భరోసా వేశారు. ఇంకా సగం మందికి రుణమాఫీ కాలేదు. రూ.40 వేల కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి.. రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. రూ. 2 లక్షల్లోపు అందరికీ మాఫీ కాలేదు. రైతు బీమా ప్రీమియం ఆరు నెలలుగా కట్టకపోవడంతో చనిపోయిన రైతు కుటుంబాలకు బీమా డబ్బులు రావడం లేదు. దేవుళ్లపై ఒట్టు వేసి మాట తప్పారు. కేసీఆర్ ఇచ్చిన పథకాల్లో కోతలు పెట్టడం తప్పా కొత్త పథకం ఒక్కటైనా తెచ్చారా. లగచర్ల, పెద్ద ధన్వాడ రైతులకు బేడీలు వేసిన చరిత్ర రేవంత్‌రెడ్డిది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైంది. రైతుబంధు ఇవ్వకపోతే ఓఆర్ఆర్‌ను దిగ్బందిస్తాం. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో ఏ రైతును, స్కూల్ పిల్లాడిని అడిగినా చెబుతారు. తెలంగాణలో అందాల పోటీలు పెడితే ఏం జరిగిందో అందరికీ తెలుసు’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
సిట్ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యాప్‌పైనే విచారణ
యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి
భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్
Read latest Telangana News And Telugu News