Share News

DGP Shivdhar Reddy: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:46 PM

హైదరాబాద్‌లో సైబర్ అవేర్‌నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉన్నారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ బాధితులు తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి.

 DGP Shivdhar Reddy: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
DGP Shivdhar Reddy

హైదరాబాద్, నవంబరు9 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాల (Cyber Fraud)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP Shivdhar Reddy) సూచించారు. ఫోన్ కాల్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌తోనే సైబర్ కేటుగాళ్లు నేరాలు చేస్తున్నారని తెలిపారు. పాత నేరస్థుల మాదిరిగానే కొత్త నేరస్థులు కూడా డేటాను సులభంగా సేకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎవరు ధనవంతులు..? ఏ లొకేషన్‌లో ఎవరూ ఉంటారు..? వయస్సు, లింగం వంటి వివరాలు అన్నీ తెలుసుకొని.. వారినే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇది సాధారణ సమస్య కాదని.. ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని పేర్కొన్నారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి.


హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్‌క్రైమ్‌ నియంత్రణపై అవగాహన కార్యక్రమం ఇవాళ(ఆదివారం) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడారు. సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమం లాగాకాకుండా, దీనిని ఒక ‘మూవ్‌మెంట్‌’గా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఇంట్లో ఉన్న మహిళలు, వృద్ధులు, గృహిణులు సైబర్ కేటుగాళ్లకు ప్రధానంగా లక్ష్యంగా మారుతున్నారని చెప్పుకొచ్చారు. మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లు చేసి భయపెట్టి మోసం చేస్తున్నారని అన్నారు. ప్రజలు అత్యంత మెలకువగా ఉండాల్సిన సమయం ఇదని తెలిపారు. యువకులు, రిటైర్డ్ వ్యక్తులు, ప్రముఖులు అందరూ కూడా ఈ అవేర్‌నెస్‌లో భాగం కావాలని మార్గనిర్దేశం చేశారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి.


సైబర్ అవేర్‌నెస్ గురించి ఒకరు పదిమందికి, పది మంది ఇరవై మందికి చెబితే ఇది పెద్ద మాస్ మూవ్‌మెంట్ అవుతుందని ఉద్ఘాటించారు. సైబర్ నేరగాళ్లకు అత్యంత అడ్డంకి ప్రజల అవగాహనేనని తెలిపారు. హైదరాబాద్‌లో సైబర్ అవేర్‌నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉన్నారని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ బాధితులు తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 24 గంటలు ‘సైబర్ పెట్రోలింగ్’ ద్వారా పనిచేస్తోందని వివరించారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి.


మోసాల అవకాశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. నేరస్థులు ఎప్పుడూ పోలీసుల కంటే ఒక అడుగు ముందుండేందుకు ప్రయత్నిస్తారని అన్నారు. అందుకే ప్రజల్లో సైబర్ అవేర్‌నెస్‌ అవగాహన మరింత అవసరమని వివరించారు. రూరల్ ఏరియాల్లో కూడా ఇలాంటి క్యాంపెయిన్ విస్తరిస్తామని తెలిపారు. హైదరాబాద్ సిటీలో ఇది ప్రారంభం మాత్రమేనని.. త్వరలోనే మొత్తం తెలంగాణలో సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం

రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది.. హరీశ్‌రావు ఫైర్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 09 , 2025 | 02:06 PM