PV Narasimha Rao Jayanti: ఆర్థిక సంస్కరణల పితామహుడికి సీఎం రేవంత్ నివాళి
ABN , Publish Date - Jun 28 , 2025 | 01:26 PM
PV Narasimha Rao Jayanti: మాజీ ప్రధాని పీవీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. పీవీ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు సీఎం.

హైదరాబాద్, జూన్ 28: మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు (Former PM PV Narasimah Rao) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు సేవలను గుర్తు చేసుకున్నారు. బహుభాషాకోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ఆయన దేశానికి ఎనలేని సేవలను అందించారని కొనియాడారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో పీవీ పాత్ర ఎనలేనిదన్నారు. సీఎంతో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి.. పీవీకి నివాళులు అర్పించారు.
భూ సంస్కరణలతో సమానత్వానికి కృషి: భట్టి
మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు జయంతి సందర్భంగా పీవీ ఘాట్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రధానిగా, ముఖ్యమంత్రిగా పీవీ దేశంలో రాష్ట్రంలో అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. ఆర్థిక సంస్కరణలతో భారత దేశాన్ని ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టారని గుర్తుచేశారు. భూ సంస్కరణలతో సమాజంలో సమానత్వానికి కృషి చేశారని తెలిపారు. భూ సంస్కరణలో భాగంగా కాంగ్రెస్ ఇప్పటి వరకు 24 లక్షల ఎకరాలకు పైగా భూమిని పేదలకు పంచిందన్నారు. తెలంగాణలో గత పదేళ్లు పాలించిన ప్రభుత్వం ధరణి తెచ్చి పేదలను ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. పేదల హక్కులను కాపాడడానికి భూభారతి చట్టాన్ని తెచ్చామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఎంత చెప్పుకున్నా తక్కువే: కేటీఆర్
మరోవైపు మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు జయంతి సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ నివాళులర్పించారు. సంస్కరణశీలి, బహుభాషా కోవిదుడు, కవి, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, నిత్య విద్యార్థి... ఇలా భారతరత్న పీవీ నరసింహారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని అన్నారు. భారత ప్రధానిగా ఆర్థిక సంస్కరణలను తెచ్చి దేశాన్ని భారీ సంక్షోభం నుంచి గట్టెక్కించిన మహా మేధావి పీవీ అని కొనియాడారు. తన సొంత భూమిని ప్రభుత్వానికి అప్పగించి దేశంలో కీలకమైన భూసంస్కరణలను ప్రారంభించిన మహనీయుడు పీవీ అని అన్నారు. గురుకుల విద్యాలయాలకు అంకురార్పణ చేసి విద్యారంగానికి ఎనలేని సేవలు చేసిన పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించిందని గుర్తు చేసుకున్నారు.
వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టిందని.. నెక్లెస్ రోడ్‌కు పీవీ మార్గ్ అని పేరు పెట్టడమే కాకుండా.. పీవీ ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం పంపిందన్నారు. పీవీ తనయ సురభి వాణీదేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించిందని చెప్పుకొచ్చారు. నవ భారత నిర్మాత పీవీ మన తెలంగాణ గడ్డపై పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. నేడు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
2050లో హైదరాబాద్ ఎలా ఉండబోతోంది?
బీఆర్‌ఎస్ ధర్నా.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News