Share News

Ration cards: రూ.ఐదువేలు ఇచ్చుకో.. కార్డు పుచ్చుకో..

ABN , Publish Date - Jun 28 , 2025 | 09:49 AM

‘మీకు కొత్త రేషన్‌ కార్డు కావాలా.. అయితే రూ.5వేలు సమర్పించుకోండి’ అంటూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు వసూళ్లకు తెరతీశారు. రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారు చివరకు డబ్బు వెచ్చించి కార్డును తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Ration cards: రూ.ఐదువేలు ఇచ్చుకో.. కార్డు పుచ్చుకో..

- కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తుదారుల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల వసూళ్లు

హైదరాబాద్‌ సిటీ: ‘మీకు కొత్త రేషన్‌ కార్డు(Ration card) కావాలా.. అయితే రూ.5వేలు సమర్పించుకోండి’ అంటూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు వసూళ్లకు తెరతీశారు. రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారు చివరకు డబ్బు వెచ్చించి కార్డును తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త రేషన్‌కార్డుల జారీకి గ్రేటర్‌ పరిధిలో క్షేత్రస్థాయి లో సర్వేలు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో దరఖాస్తులు చాలా వరకు పెండింగ్‌లో ఉంటున్నాయి.


పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం సిబ్బంది తక్కువగా ఉన్నారని, ఎక్కువ సంఖ్యలో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలంటే సమయం పడుతుందని చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు 50శాతం కూడా పరిశీలించలేదని సమాచారం. ప్రస్తుతం రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం ఇస్తుండడంతో చాలామంది కొత్త రేషన్‌కార్డును ఎలాగైనా పొందాలనే పట్టుదలతో సివిల్‌ సప్లయ్‌ అధికారులను ఆశ్రయిస్తున్నారు.


ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకున్న పౌరసరఫరాల శాఖలోని కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు రేషన్‌కార్డు జారీ కోసం అక్రమ వసూళ్లకు తెరలేపినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే బాలానగర్‌ ప్రాంతంలో కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులను పరిశీలించి ఇవ్వడానికి ఏఎస్ఓ కార్యాలయంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులతో అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు వాపోయారు.


దరఖాస్తుదారుల నుంచి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విధిలేక కొందరు డబ్బులు ముట్టజెపుతున్నారని, ఈ అక్రమ వసూళ్లలో కొంతమంది అధికారులకు కూడా వాటా వెలుతున్నట్లు సమాచారం. డబ్బులిచ్చిన వారి దరఖాస్తులకు ప్రాధాన్యం ఇస్తూ, ఇతర దరఖాస్తులు పెండింగ్‌లోనే పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన..

కొత్త రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని, అర్హులకు రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు, ఉద్యోగులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. చాలా మంది అర్హత లేకపోయినా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాటన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు వివరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం ధర భారీగా తగ్గిందోచ్, కానీ వెండి మాత్రం

ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 28 , 2025 | 09:49 AM