MP Kiran Kumar Reddy: బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా రాస్తే ఆంధ్రా మీడియానా.. ఎంపీ చామల ఫైర్
ABN , Publish Date - Jul 08 , 2025 | 11:52 AM
దేశంలో తెలంగాణను ముందుంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక్కడున్న వ్యాపారస్తులను, పత్రికల యాజమాన్యాలను బీఆర్ఎస్ నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

ఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని పత్రికలు, టీవీ ఛానల్ మీద బీఆర్ఎస్ నేతలు చూపిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ అధికారం గురించి ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి చెడుప్రచారం గురించి ఏ ఛానల్ అయినా చెప్పక తప్పదు కదా అని ప్రశ్నించారు. ఆయా కథనాలు చెప్పినప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీగా ఉండి మంచిని, చెడును రెండింటిని ఆస్వాదించడం నేర్చుకోవాలని సూచించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
అది కాకుండా మీడియాపై దాడి చేయడమే కాకుండా ఇంకా దాడులు చేస్తామని మాట్లాడటం సరికాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మీరు ఫామ్‌హౌస్‌లో ఉండి మీ అల్లుడు, కొడుకు రెచ్చగొట్టి కార్యకర్తలతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఇవాళ(మంగళవారం) ఢిల్లీ వేదికగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలో తెలంగాణను ముందుంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడున్న వ్యాపారస్తులను, పత్రికల యాజమాన్యాలను బీఆర్ఎస్ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ అని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారు..
‘బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా రాసే పత్రికలు, టీవీలపై దాడులకు ఉపక్రమించడం సరికాదు. ఉద్యమ సమయంలో మాదిరిగా తిరిగి సెంటిమెంట్‌ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. బావ, బామ్మర్థులు బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారు. వాళ్ల గురించి అనుకూలంగా రాసే పత్రికలు, టీవీ ఛానళ్లనే తెలంగాణకి సంబంధించినవని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గురించి ఎవరూ నెగిటివ్‌గా మాట్లాడవద్దని, తాము చేసిన తప్పిదాలు రాయొద్దు, ఛానల్‌లో చూపించవద్దు అంటే ఎలా?. తెలంగాణలో బీఆర్ఎస్ గురించి ఎవరూ నెగిటివ్‌గా మాట్లాడినా, రాసినా ఆంధ్ర ఛానల్ అంటున్నారు. గతంలో దివంగత నేత నందమూరి తారక రామారావు దగ్గర బీఫామ్ కోసమే కేసీఆర్ తన కొడుకు పేరుని అబద్ధంగా చెప్పారు. ఆ తర్వాత నుంచి అజయ్ అన్న పేరుని తారక రామారావుగా మార్చుకున్నారు. కానీ మళ్లీ ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యత్యాసం తీసుకువచ్చి అందరూ సుఖంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజలను రెచ్చగొడుతున్నారు. కేటీఆర్ స్నేహితులంతా ఆంధ్ర వాసులే, ఆయన తిరిగిన ఫిలిమ్ ఇండస్ట్రీకి సంబంధించిన మిత్రులందరూ ఆంధ్ర వాళ్లే. కేటీ రామారావు చదువుకున్నది గుంటూరు విజ్ఞాన్ కాలేజ్‌లో.. ఆ కాలేజ్‌లో చదివి జ్ఞానం లేని మాటలు కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. మా ప్రభుత్వంలో హైదరాబాద్‌ని గ్లోబల్ సిటీగా చేయాలనుకుంటున్నాం. ఒక మంచి రైసింగ్ తెలంగాణ స్లోగన్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది’ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం!
Read Latest Telangana News And Telugu News