Minister Prabhakar: చర్చకు రండి.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఓపెన్ ఛాలెంజ్
ABN , Publish Date - Aug 01 , 2025 | 08:17 PM
తెలంగాణలో ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రేషన్ కార్డులు రాని పేదలు దరఖాస్తు చేసుకుంటే పార్టీలకు అతీతంగా అందజేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రోడ్లు, విద్యుత్, ఇతర సమస్యలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పుడు రేషన్ కార్డుల (Ration Cards) పండుగ జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఉచిత బస్సులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని సంతోషం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ 3,500 ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే కొత్తగా 5500 రేషన్ కార్డులు ఇస్తున్నామని నొక్కిచెప్పారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్.
రేషన్ కార్డుల్లో అర్హులు ఉంటే లబ్ధిదారులందరికీ అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. రేషన్ కార్డుల్లో 2,30,000 మంది నూతన పేర్లు చేర్చామని చెప్పుకొచ్చారు. రేషన్ కార్డులు రాని పేదలు దరఖాస్తు చేసుకుంటే పార్టీలకు అతీతంగా అందజేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రోడ్లు, విద్యుత్, ఇతర సమస్యలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. 56941 రేషన్ కార్డులు ఉంటే 2లక్షల మందికి సన్నబియ్యం అందజేస్తున్నామని ప్రకటించారు. అభివృద్ధి పనుల్లో తమ ప్రభుత్వం రాజకీయం చేయదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇవాళ(శుక్రవారం ఆగస్టు1) జూబ్లీహిల్స్ నియోజకవర్గం రేషన్ కార్డుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, దేదీప్య, రాజ్‌కుమార్ పటేల్ తదితరులతో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేసిందని ప్రకటించారు గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించలేదని.. తమ ప్రభుత్వంలో రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులకు తెరపడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ సభలో వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృతంలోని తెలంగాణ ప్రభుత్వం సుమారు 6 లక్షల పై చిలుకు కార్డులను అందజేశామని తెలిపారు. దేదీప్య మాట్లాడుతుండగా మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డు తగిలారు. అప్పుడు మీ ప్రభుత్వం చేసిన ప్రతి విషయం ప్రజలు గమనించారని అన్నారు. అనంతరం దేదీప్య మాట్లాడిన తర్వాత ఆక్వా చైర్మన్ రాఘవరెడ్డి గత కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆ సమయంలో దేదీప్య మాట్లాడేందుకు ప్రయత్నించగా చాల్లే అమ్మ కూర్చో అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. పేదలకు నిజమైన సేవ చేసే పార్టీ కాంగ్రెస్ అని ఉద్ఘాటించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో భారీ సంఖ్యలో రేషన్ కార్డులను తమ ప్రభుత్వం అందజేస్తోందని ఆక్వా చైర్మన్ రాఘవరెడ్డి పేర్కొన్నారు.
రేషన్ కార్డుల పంపిణీని రాజకీయ సభగా మార్చారు:కార్పొరేటర్ దేదీప్య
ఈ సమావేశం అనంతరం వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాజకీయ సభగా నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులను సభపై కూర్చోబెట్టారని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు ఇస్తామని గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు కార్పొరేటర్ దేదీప్య.
ఉచిత కరెంటు, గ్యాస్ పథకం సరిగా అమలు కావడం లేదని కార్పొరేటర్ దేదీప్య విమర్శించారు. ఇప్పటికైనా గత ప్రభుత్వాలను విమర్శించడం మాని ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో కేసీఆర్ ఎవరికీ సీటు కేటాయించిన బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి పనిచేస్తామని ఉద్ఘాటించారు. ఉప ఎన్నికలో సీటు ఆశిస్తున్నారా అని మీడియా ప్రతినిధులు అడిగిన సమాధానానికి బదులుగా పార్టీ సీటు కేటాయిస్తే బరిలో ఉండేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అదే సమయంలో పార్టీ తరఫున ఎవరికీ సీటు కేటాయించిన పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని దేదీప్య పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత
Read latest Telangana News And Telugu News