Minister Ponnam Prabhakar: మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
ABN , Publish Date - Jul 06 , 2025 | 02:11 PM
మోదీ ప్రభుత్వం.. వాగ్దానాలతో ఊదరగొట్టడం… విద్వేషాన్ని రెచ్చగొట్టడం… అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప దేశ ప్రజలకు చేసిందేమి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను అడుగడుగునా మోసం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావుకు (Ramachandra Rao) మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఇవాళ(ఆదివారం) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను మంత్రి పొన్నం ప్రస్తావించారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు తేలేని బీజేపీ నేతలు.. తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మోదీ సర్కార్ మెగా ఫెయిల్యూర్స్ సంగతేందని రామచందర్‌రావుని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను అడుగడుగునా మోసం చేసిందని ఆరోపించారు. వాగ్దానాలతో ఊదరగొట్టడం… విద్వేషాన్ని రెచ్చగొట్టడం… అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప మోదీ ప్రభుత్వం చేసిందేమి లేదని విమర్శించారు. అలాంటి మీరు మా సీఎంకి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గురువింద సామేతను గుర్తు చేసే విధంగా ఉన్న మీ లేఖ నవ్వు తెప్పిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ సెటైర్లు గుప్పించారు.
మోదీ పాలనలో బీసీలకు ఏం చేశారు: హనుమంత్ రావు
11 ఏళ్ల మోదీ పాలనలో బీసీలకు ఏం చేశారని మాజీ ఎంపీ వీ.హనుమంత్ రావు (Hanumanth Rao) ప్రశ్నించారు. ఇవాళ(ఆదివారం) గాంధీభవన్‌లో మీడియాతో హనుమంత్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తొలి ఏకాదశి, పీర్ల పండగ శుభాకాంక్షలు తెలిపారు. మూడుసార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీనీ కలసి.. బీసీలకు వేర్వేరుగా మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని కోరామని గుర్తుచేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలతో ఓబీసీలను పైకి తీసుకురావడానికి కర్ణాటకలో ఈ నెల(జులై) 15వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తనకు ఆహ్వానం పంపారని గుర్తుచేశారు హనుమంత్ రావు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎందుకు రైల్‌రోకో చేస్తుందో అర్ధం కావడం లేదని హనుమంత్ రావు విమర్శించారు. తాము 42శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే కవిత అప్పుడు రైల్ రోకో చేయాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక న్యాయ సమరభేరి సభ విజయవంతం అయిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారని అన్నారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం కష్టపడిన వాళ్లకు పదవి ఇవ్వాలని పీఏసీ సమావేశంలో చెప్పారని హనుమంత్ రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం
డిజిటల్ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ
Read Latest Telangana News And Telugu News