Share News

Mallikarjuna Kharge: తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

ABN , Publish Date - Jul 24 , 2025 | 03:27 PM

దేశవ్యాప్తంగా జాతీయ కుల గణాంకాల సమీక్ష జరపాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ప్రజల ఒత్తిడికి లోనై కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని... కానీ 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎందుకు తొలగించలేదని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.

Mallikarjuna Kharge: తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
Mallikarjuna Kharge

ఢిల్లీ: తెలంగాణలో శాస్త్రీయంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ఉద్ఘాటించారు. తెలంగాణ సర్వే ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యాసంస్థల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సిఫారసు చేస్తోందని తెలిపారు. బీసీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తోందని వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ప్రయత్నంలో కృషి చేసిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని బృందానికి కృతజ్ఞతలు తెలిపారు మల్లికార్జున ఖర్గే.


కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రిమండలి, ఎంపీలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌(X)లో మల్లికార్జున ఖర్గే పోస్ట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. బలహీన వర్గాల కోసమే ఈ న్యాయ పోరాటమని నొక్కిచెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తోందని ఉద్ఘాటించారు. దశాబ్దాలుగా పక్కకు నెట్టివేయబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల ప్రజల గళంగా కాంగ్రెస్ పనిచేస్తోందని స్పష్టం చేశారు మల్లికార్జున ఖర్గే.


దేశ జనాభాలో మెజార్టీ సంఖ్య అయినా… కార్పొరేట్ బోర్డులు, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, ఉన్నత విద్యాసంస్థల్లో వర్ణహీనత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కూడా అన్యాయం జరుగుతోందని.. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారని గుర్తుచేశారు. 80 శాతం ఓబీసీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. అలాగే 83 శాతం ఎస్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా జాతీయ కుల గణాంకాల సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. ప్రజల ఒత్తిడికి లోనై కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని... కానీ 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎందుకు తొలగించలేదని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు

సినీ నటుడు రాజీవ్ కనకాలకు హయత్‌నగర్ పోలీసుల నోటీస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 03:35 PM