Kavitha: బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:21 PM
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్‌కు తెలియవని వాపోయారు. సామాజిక తెలంగాణ సాధననే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
మెదక్ జిల్లా, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao)లతో సహా పలువురు బీఆర్ఎస్ (BRS) నాయకులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(శనివారం) మెదక్ జిల్లాలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నానని వివరించారు. సోషల్ మీడియాలో మాత్రమే బీఆర్ఎస్ ఉందని.. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోయిందని విమర్శలు చేశారు.
కేటీఆర్ ప్రజల్లోకి రావాలి..
మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా మానేసి ప్రజల్లోకి రావాలని సూచించారు. బీఆర్ఎస్ కేడర్ వేలమంది తమతో టచ్‌లో ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు గతంలో ఎలా ఉండేవారని.. ఇప్పుడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నల వర్షం కురిపించారు. తామే ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తామని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ నేతలు ఆస్తులు పెంచుకున్నారని... కానీ కేడర్‌ను మాత్రం పెంచుకోలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితోనే తాము ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు కవిత.
రైతులను బలిచేస్తున్నారు..
‘బీఆర్ఎస్‌కు చెందిన పెద్ద రైతుల కోసం చిన్న రైతులను బలిచేస్తున్నారు. హరీశ్‌రావు ఫాంహౌజ్ ఆ సమీపంలో ఉండటంతోనే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చారని రైతులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, నవీన్ రావు ఓ ల్యాండ్ కోసం ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ మార్చారు. వీళ్లు చేసే అరాచకాల వల్లే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. వీరంతా కేసీఆర్‌ను తప్పుదోవ పట్టించి అక్రమాలకు పాల్పడ్డారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కౌడిపల్లి ఎస్టీ బాలుర వసతి గృహం పేరిట రూ 1.5 లక్షల కిరాయి వస్తోంది. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ హాస్టల్‌ను మార్చాలి. ఆర్ఆర్ఆర్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. కోటి ఇవ్వాలి. లేదంటే భూమికి భూమి ఇవ్వాలి’ అని కవిత సూచించారు.
హరీశ్‌రావు నిర్లక్ష్యం చేశారు...
‘కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు ఉన్నారని... ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు. ఎత్తు పెంచితే కొల్చారం, పాపన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో భూములు పోతున్నాయి. మెదక్ జిల్లాలో అభివృద్ధి దారుణంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఉద్యమ కారులను ఏనాడూ పట్టించుకోలేదు. మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలి. మెదక్‌లో ఎలాంటి సౌకర్యాలు లేవని మెడికల్ సీట్లను సీఎం రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం కొడంగల్‌కు తీసుకెళ్లారు. మెదక్ జిల్లాలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత ఇబ్బంది పడుతోంది’ అని కవిత విమర్శించారు.
బతుకులు మారలేదు..
‘కాళేశ్వరం ద్వారా మెదక్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి.. ఒక్కచుక్క కూడా నీళ్లు రాలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదు. జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్‌కు తెలియవు. సామాజిక తెలంగాణ సాధనే మా లక్ష్యం. గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొంత అభివృద్ధి జరిగింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏమి చేయలేదు. హరీశ్‌రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎం రేవంత్‌రెడ్డికు సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రశ్నించే శక్తిగా జాగృతి పనిచేస్తోంది’ అని కవిత ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక
Read Latest Telangana News and National News