Share News

CM Revanth on MODI: కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:10 PM

బ్రిటిష్ పాలకులను తరిమికొట్టిన పార్టీ కాంగ్రెస్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ అని నొక్కిచెప్పారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్‌ అని అభివర్ణించారు. బీజేపీ‌తో సహా అన్ని పార్టీలు అధికారంలో లేకపోతే ఇంటికే పరిమితమని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.

CM Revanth on MODI: కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy Fires on MODI

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై (PM Narendra Modi) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తన కుర్చీ వదులుకోవడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. 75 ఏళ్లు నిండిన వారిని పదవి నుంచి వైదొలగాలని ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పినా మోదీ ఎందుకు వినడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. 2001 నుంచి మోదీ కుర్చీ ఎందుకు వదలడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అద్వానీ, మురళీ మనోహర్‌జోషికి వర్తించిన వయసు మోదీకి వర్తించదా? అని నిలదీశారు. మోదీని వచ్చే ఎన్నికల్లో కుర్చీ నుంచి దించేది రాహుల్ గాంధీ మాత్రమేనని ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో మోదీని ఓడిస్తామని హెచ్చరించారు. మోదీని ఓడిస్తాం, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతామని ఉద్ఘాటించారు. ఢిల్లీలో సీఎం రేవత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఇవాళ(శనివారం) ఢిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.


దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి నొక్కిచెప్పారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్‌ అని అభివర్ణించారు. బీజేపీ‌తో సహా అన్ని పార్టీలూ అధికారంలో లేకపోతే ఇంటికే పరిమితమని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్‌ది ప్రజాపక్షమేనని ఉద్ఘాటించారు. పాకిస్థాన్‌పై యుద్ధం చేసి తూర్పు పాకిస్థాన్‌ని విడదీసింది కాంగ్రెస్‌ అని గుర్తుచేశారు. దేశం కోసం తన ప్రాణాన్ని కూడా ఇందిరాగాంధీ త్యాగం చేశారని కొనియాడారు. స్వాతంత్య్రం రాకముందే కాంగ్రెస్ పార్టీ ఉందని తెలిపారు. బీజేపీ నేతలకు గుర్తు చేస్తున్నా.. బ్రిటిష్ వాళ్లతో పోరాడి స్వాతంత్య్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్సే అని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఇందిరాగాంధీ పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించి పాకిస్థాన్‌ను రెండు ముక్కులు చేసి కాళీకామాత అవతారం ఎత్తారని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని ఇందిరాగాంధీ రక్షించారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల పోరులో మరణించారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో మోదీ, బీజేపీని కాంగ్రెస్ ఓడిస్తుందని తెలిపారు. 2004 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చినా సోనియాగాంధీ ప్రధాని పదవి తీసుకోలేదని గుర్తుచేశారు. ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత సోనియాగాంధీదని ప్రశంసించారు. రాహుల్‌‌గాంధీ ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.


దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్‌ అమలు చేసి చూపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని తెలిపారు. రాహుల్‌ను ప్రధానిని చేసేవరకు కాంగ్రెస్ శ్రేణులు కలిసి పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని నొక్కిచెప్పారు. సామాజిక న్యాయం కోసం కేంద్రప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లకు మించి గెలవదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంతా రాహుల్ గాంధీ వెంట ఉంటారని ఉద్ఘాటించారు. మోదీ నుంచి దేశాన్ని రక్షిస్తామని తెలిపారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రెండో రోజు కస్టడీకి డాక్టర్ నమ్రత.. ఈ రోజైనా మౌనం వీడుతుందా..?

ఐటీమంత్రి శ్రీధర్‌బాబు ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 07:31 PM