KTR: పత్తి రైతుల సమస్యలు పరిష్కరించరా.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:04 PM
వ్యవసాయ మంత్రికి రైతన్నలపై ప్రేమ ఉంటే నిన్న(సోమవారం) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దమ్ముంటే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20వేలు ప్రకటించాలని సవాల్ చేశారు కేటీఆర్.
ఆదిలాబాద్, నవంబరు18(ఆంధ్రజ్యోతి): పత్తి రైతుల సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విఫలం అయ్యారన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలులో ప్రైవేటు వ్యాపారులతో అధికారులు కుమ్మక్కు అయినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఇవాళ(మంగళవారం) ఆదిలాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కేటీఆర్.
ఈ నెల 21వ తేదీన ఆదిలాబాద్‌లో జరిగే అఖిలపక్షం ఆందోళనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. పత్తిని పరోక్షంగా ప్రైవేటుకు అమ్మేలా అధికారులు చేస్తున్నారని.. దీని వల్ల అన్నదాతలు క్వింటాకు రూ. 1500 నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫింగర్ ప్రింట్ విధానంతో రైతన్నలని ఇబ్బంది పెట్టవద్దని కోరారు. తాము వస్తున్నామని తెలిసి ఫింగర్ ప్రింట్ విధానం ఆపేశారని విమర్శించారు. తాము అడిగితే ఎకరాకు 10క్వింటాళ్ల పత్తి కొంటామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు కేటీఆర్.
రాష్ట్ర వ్యవసాయ మంత్రికి రైతన్నలపై ప్రేమ ఉంటే నిన్న(సోమవారం) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20వేలు ప్రకటించాలని సవాల్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. నాణ్యమైన పత్తి తెలంగాణలో పండుతుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశాల నుంచి దిగుమతికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఉండే బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు అన్నదాతల కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు కేటీఆర్.
ఇవి కూడా చదవండి...
కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవు
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం
Read Latest Telangana News And Telugu News