India vs England: బుమ్రా సంచలన వ్యాఖ్యలు.. నచ్చింది చేసుకోమంటూ..!
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:29 PM
భారత పేస్ గన్ జస్‌ప్రీత్ బుమ్రా ఎక్కువగా మాట్లాడడు. ఎన్ని విమర్శలు వచ్చినా వాటికి బంతితోనే సమాధానం ఇస్తుంటాడు. అలాంటోడు ఏం చేసుకుంటారో చేస్కోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

కొందరు క్రికెటర్లు ఆటతీరుతోనే కాదు.. మాటతీరుతోనూ అభిమానులను ఆకట్టుకుంటారు. విమర్శలు వస్తే అదే మాటను తూటాలా వాడి బదులిస్తుంటారు. అయితే ఇంకొందరు ప్లేయర్లు మాత్రం మాట కంటే ఆటతోనే విమర్శకులకు జవాబు ఇస్తుంటారు. భారత పేస్ గన్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ కోవలోకే వస్తాడు. ఎవరు ఏమన్నా పెద్దగా పట్టించుకోని పేసుగుర్రం.. బంతితోనే అన్నింటికీ సమాధానం చెబుతుంటాడు. అలాంటోడు ఈసారి మాటలతో గట్టిగా ఇచ్చిపడేశాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కౌంటర్ అటాక్ మొదలుపెట్టాడు. అసలేం జరిగిందంటే..
వ్యూయర్‌షిప్ కోసమే..
‘ఎవరి రాతల్ని నేను మార్చలేను. ఎవరికి తోచింది వాళ్లు రాస్తుంటారు. అలాంటి వాళ్లకు ఏం రాయాలి, ఏం రాయకూడదనేది నేను నేర్పించను. వాళ్లకు తోచింది చేసుకోనివ్వండి. ఎవరి స్వేచ్ఛ వాళ్లది. భారత్‌లో క్రికెట్ చాలా పాపులర్ అనే విషయం నాకు తెలుసు. హెడ్‌లైన్స్‌లో నా పేరు ఉంటే వ్యూయర్‌షిప్ భారీగా పెరుగుతుందనేది కూడా తెలుసు. అయితే ఎవరేం రాసినా నేను పట్టించుకోను. ఎందుకంటే ఎవరో ఏదో రాస్తున్నారని నేను పట్టించుకుంటే వాటిని నమ్మాల్సి వస్తుంది. దీని వల్ల లేనిపోని తలనొప్పులు మొదలవుతాయి. నేనేం చేయాలి, ఎలా ఆడాలి, ఏ విషయాన్ని పట్టించుకోవాలనేది నాకు తెలుసు. నాకు నచ్చినట్లు చేస్తా. నేనేం చేయాలో ఇతరులు నిర్ణయించకూడదు’ అని బుమ్రా స్పష్టం చేశాడు.
6 నెలలూ ఆడలేనన్నారు..
కెరీర్ ఆసాంతం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని లీడ్స్ టెస్ట్ మూడో రోజు అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బుమ్రా చెప్పుకొచ్చాడు. భారత్‌కు ఆడాలనేది తన చిరకాల కోరిక అని.. అయితే తాను టీమిండియాకు ఆడలేనని కొందరు విమర్శించారని బుమ్రా తెలిపాడు. జట్టుకు ఎంపికయ్యాక కూడా ఆర్నెళ్ల కంటే ఎక్కువ ఆడలేడంటూ నిరుత్సాహపర్చారని అతడు గుర్తుచేసుకున్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో 10 ఏళ్లుగా కొనసాగుతున్నానని.. తానేంటో తనకు తెలుసునన్నాడు బుమ్రా.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి