Jasprit Bumrah: బుమ్రానే రియల్ గోట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఇంగ్లీష్ మీడియా!
ABN , Publish Date - Jun 23 , 2025 | 02:51 PM
టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తేసింది ఇంగ్లీష్ మీడియా. రియల్ గోట్ అంటూ అతడి గురించి గొప్పగా రాసింది.

భారత జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు చాలా విమర్శల్ని ఎదుర్కొంటుండటం చూస్తున్నాం. ఆతిథ్య దేశ మీడియాతో మన జట్టు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. ఎంత బాగా ఆడినా మన ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకొని ఉన్నవీ లేనివి రాస్తూ, ట్రోల్ చేయడం వాళ్లకు అలవాటుగా మారింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈసారి కూడా అదే జరిగింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల గైర్హాజరీలో ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లిన భారత జట్టుపై అక్కడి మీడియా విమర్శనాస్త్రాలు సంధించింది. జట్టులో పసలేదు.. అంతా యువకులేనంటూ తీసిపారేసింది. అయితే ఒకే ఒక్కడు అంతా మార్చేశాడు. అతడే పేస్ గన్ జస్‌ప్రీత్ బుమ్రా. అతడి దెబ్బకు అక్కడి మీడియా దారికొచ్చింది.
నిప్పులు చెరిగే బంతులతో..
లీడ్స్ టెస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను అతడు చావుదెబ్బ కొట్టాడు. 24.4 ఓవర్లు వేసిన భారత స్పీడ్‌స్టర్ 83 పరుగులు ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌కు తోడు భీకర పేస్‌తో అతడు వేసిన బంతులకు ఆతిథ్య జట్టు బ్యాటర్లు వణికిపోయారు. క్రాలే, డకెట్, రూట్.. ఇలా టాప్ బ్యాటర్లను అతడే పెవిలియన్‌కు పంపించాడు. దీంతో అతడ్ని ఇంగ్లీష్ మీడియా ప్రశంసల్లో ముంచెత్తింది. బుమ్రా రియల్ గోట్.. అతడే నిజమైన తోపు అంటూ మెచ్చుకుంది.
అతడో గ్లాడియేటర్..
రెడ్ బాల్ క్రికెట్‌లో బుమ్రా లాంటి ఫాస్ట్ బౌలర్ మరొకరు లేరని.. ఈ తరంలో అతడే అత్యుత్తమమని ప్రముఖ కాలమిస్ట్ స్కైల్డ్ బెర్రీ టెలిగ్రాఫ్ పత్రికలో రాసుకొచ్చారు. కగిసో రబాడ, ప్యాట్ కమిన్స్‌తో పోలిస్తే బుమ్రా చాలా ఎత్తులో ఉన్నాడని, అతడ్ని అందుకోవడం ఎవరి వల్లా కాదని ఆయన మెచ్చుకున్నారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ పేసర్, కంప్లీట్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా అని ప్రముఖ ఇంగ్లీష్ మీడియా సంస్థ బీబీసీ ప్రశంసల్లో ముంచెత్తింది. మైదానంలోకి గ్లాడియేటర్ మాదిరిగా బుమ్రా అడుగుపెట్టాడని, అతడి బౌలింగ్ అద్భుతమంటూ డైలీ మెయిల్ తమ కాలమ్‌లో రాసుకొచ్చింది. ఇలా ఇంగ్లీష్ మీడియా మొత్తం బుమ్రాను హీరోలా ఆకాశానికెత్తేసింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి