Share News

BCCI: సంబరాల నిబంధనలు కఠినతరం

ABN , Publish Date - Jun 23 , 2025 | 03:11 AM

ఐపీఎల్‌ విజేత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) సంబరాలు తీవ్ర విషాదంగా మారిన నేపథ్యంలో బీసీసీఐ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇక మీదట ఐపీఎల్‌ విక్టరీ ఈవెంట్‌ను నిర్వహించాలనుకొంటే బోర్డు రూపొందించిన నిబంధనలను...

BCCI: సంబరాల నిబంధనలు కఠినతరం

  • బెంగళూరు ఘటన నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ విజేత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) సంబరాలు తీవ్ర విషాదంగా మారిన నేపథ్యంలో బీసీసీఐ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇక మీదట ఐపీఎల్‌ విక్టరీ ఈవెంట్‌ను నిర్వహించాలనుకొంటే బోర్డు రూపొందించిన నిబంధనలను కచ్చితంగా అనుసరించాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్పష్టం చేశాడు. బోర్డు రూల్స్‌ ప్రకారం ఇక మీదట టైటిల్‌ నెగ్గిన 3-4 రోజుల్లోపు సంబరాలకు అనుమతిలేదు. అలాగే హడావుడిగా ఏ కార్యక్రమాన్నీ నిర్వహించకూడదు. ఏ విధమైన సెలెబ్రేషన్స్‌ చేయాలన్నా బీసీసీఐ నుంచి ముందస్తుగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, స్థానిక సంస్థల నుంచి క్లియరెన్స్‌ తప్పనిసరి. పరేడ్‌లో పాల్గొనే జట్టుకు 4-5 అంచెల భద్రతను ఏర్పాటు చేయాలి. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఈవెంట్‌ వేదిక వరకు తగినంత భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈవెంట్‌ సందర్భంగా ఆటగాళ్లకు, సహాయ సిబ్బందికి కట్టుదిట్టమైన రక్షణ ఉండేలా చూసుకోవాలి. ఈనెల 4న బెంగళూరులో నిర్వహించిన ఆర్సీబీ విక్టరీ సంబరాల్లో తొక్కిసలాట కారణంగా 11 మంది మృతి చెందగా.. ఎంతో మంది గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని ముందే ఊహించిన బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు అనుమతి నిరాకరించినా.. ఫ్రాంచైజీ మాత్రం విక్టరీ పరేడ్‌ను ప్రకటించింది. చిన్నస్వామి స్టేడియం వద్దకు సామర్థ్యానికి మించి ఫ్యాన్స్‌ చేరుకోవడం తొక్కిసలాటకు దారితీసింది. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక ప్రభుత్వం బీసీసీఐ, ఫ్రాంచైజీనే దీనికి బాధ్యత వహించాలని చెప్పింది.

Updated Date - Jun 23 , 2025 | 03:11 AM