India vs England Test Match: ఆధిక్యం స్వల్పమే
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:22 AM
ఫీల్డింగ్ వైఫల్యానికి తోడు బుమ్రా (5/83) మినహా ఇతర బౌలర్లు పెద్దగా రాణించకపోయినా... భారత్‌కు ఆరు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఊరట దక్కింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 90/2 స్కోరుతో ఆడుతోంది.

భారత్ రెండో ఇన్నింగ్స్ 90/2
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 465 ఆలౌట్
రాణించిన బ్రూక్
ఐదు వికెట్లతో చెలరేగిన బుమ్రా
లీడ్స్: ఫీల్డింగ్ వైఫల్యానికి తోడు బుమ్రా (5/83) మినహా ఇతర బౌలర్లు పెద్దగా రాణించకపోయినా... భారత్‌కు ఆరు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఊరట దక్కింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 90/2 స్కోరుతో ఆడుతోంది. క్రీజులో రాహుల్ (47), కెప్టెన్ గిల్ (6) ఉన్నారు. ఇప్పటికి 96 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌కు నాలుగో రోజు ఆట కీలకం కానుంది. బ్యాటర్లు ఏ మేరకు క్రీజులో నిలుస్తారన్నదానిపై ఇంగ్లండ్ ఛేదన ఆధారపడి ఉంటుంది. గెలుపుపై ఆశలు పెట్టుకోవాలంటే కనీసం 300 లక్ష్యమైనా ఆతిథ్య జట్టు ముందుంచాలి. ఇక హ్యారీ బ్రూక్ (99) ఎదురుదాడికి టెయిలెండర్లు కూడా సహకరించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. పోప్ (106), స్మిత్ (40), వోక్స్ (38) రాణించారు. బుమ్రాకు 5, ప్రసిద్ధ్‌కు 3, సిరాజ్‌కు 2 వికెట్లు పడ్డాయి. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో భారత ఫీల్డర్లు మొత్తం ఐదు క్యాచ్‌లను వదిలేయగా ఇందులో బుమ్రా బౌలింగ్‌లోనివే నాలుగు ఉండడం గమనార్హం. జైస్వాల్ మూడింటిని నేలపాలు చేశాడు.
బ్రూక్ జోరు: 209/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ బ్యాటర్లు దూకుడు ప్రదర్శించారు. తొలి సెషన్‌లో ఆకాశం మేఘావృతానికి తోడు గాలి ఎక్కువగానే వీచినా భారత పేసర్లు బంతిని స్వింగ్ చేయలేకపోయారు. దీనికి తోడు ఫీల్డింగ్ వైఫల్యం ప్రత్యర్థికి కలిసొచ్చింది. ముఖ్యంగా బ్రూక్ ఎదురుదాడికి తొలి సెషన్‌లో జట్టు 28 ఓవర్లలో 118 రన్స్ సాధించింది. అయితే సెంచరీ హీరో పోప్‌ను ఆరంభంలోనే ప్రసిద్ధ్ అవుట్ చేయగా.. కెప్టెన్ స్టోక్స్ (20)తో కలిసి బ్రూక్ ఐదో వికెట్‌కు 51 పరుగులు జత చేశాడు. కానీ బ్రూక్ 46 పరుగుల వద్ద ఉన్నప్పుడు పంత్ క్యాచ్ వదిలేశాడు.
మరింత వేగంగా..: రెండో సెషన్‌లో ఇంగ్లండ్ ఆటలో మరింత వేగం పెరిగింది. సిరాజ్, ప్రసిద్ధ్ ధారాళంగా రన్స్ ఇవ్వడంతో ఆ జట్టు 23.4 ఓవర్లలో 138 పరుగులు సాధించింది. పేసర్ బుమ్రా మాత్రం ఐదు వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. లంచ్ బ్రేక్ తర్వాత సిక్సర్‌తో ఊపు మీదున్న స్మిత్‌ను పేసర్ ప్రసిద్ధ్ వెనక్కిపంపాడు. అయితే అప్పటికే ఆరో వికెట్‌కు బ్రూక్-స్మిత్ జోడీ 73 పరుగులను జత చేయగలిగింది. ఆ తర్వాత కూడా బ్రూక్ జోరు తగ్గలేదు. 80 ఓవర్ల తర్వాత భారత్ రెండో కొత్త బంతిని తీసుకున్నా ఫలితం కనిపించలేదు. దీనికి తోడు బ్రూక్ 82 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్లిప్‌లో జైస్వాల్ సులువైన క్యాచ్‌ను వదిలేశాడు. కానీ సెంచరీకి పరుగు దూరంలో ప్రసిద్ధ్ షార్ట్ పిచ్ బాల్‌కు బ్రూక్ క్యాచ్ అవుటయ్యాడు. చివర్లో టెయిలెండర్లతో కలిసి వోక్స్ చెలరేగాడు. అటు ఇంగ్లండ్‌కు ఆధిక్యం ఖాయమనిపించిన దశలో కార్స్‌ను సిరాజ్ బౌల్డ్ చేయగా.. వోక్స్, టంగ్ (11)లను బుమ్రా అవుట్‌చేసి భారత్‌కు 6 పరుగుల ఆధిక్యం అందించాడు.
నిలకడగా..: భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జైస్వాల్ (4) నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగినా.. సాయి సుదర్శన్‌తో కలిసి మరో ఓపెనర్ రాహుల్ పరిస్థితిని చక్కదిద్దాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన సుదర్శన్ ఈసారి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. 24 పరుగుల వద్ద సుదర్శన్ క్యాచ్‌ను డకెట్ వదిలేశాడు. అయితే కాసేపటికే అతడిని స్టోక్స్ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 24వ ఓవర్‌లో వర్షం రావడం, అప్పటికే సమయం ఆరు కావడంతో మూడో రోజు ఆటను ముగించారు.
అంపైర్‌పై పంత్ అసహనం
మూడో రోజు ఆటలో ఫీల్డ్ అంపైర్ క్రిస్ గఫానీపై కీపర్ పంత్ అసహనం వ్యక్తం చేశాడు. తొలి సెషన్‌లో బంతి మార్చమని కెప్టెన్ గిల్, బౌలర్లు పలుమార్లు కోరినా అంపైర్ తోసిపుచ్చాడు. పంత్ కూడా ఇదే విషయం మరోసారి అడగడంతో బంతిని గాగ్‌లో చెక్ చేసి కుదరదన్నాడు. పంత్ ఆగ్రహంతో ఆ బంతిని విసురుగా విసిరేసి అక్కడి నుంచి ముందుకు కదిలాడు. అయితే 75వ ఓవర్‌కు ముందు మరోసారి భారత్ అభ్యర్థన మేరకు అంపైర్ చెక్ చేస్తే ఈసారి గాగ్ టెస్టులో విఫలం కావడంతో మరో బంతినిచ్చారు.
నల్ల బ్యాడ్జీలతో..
ఇంగ్లండ్ మాజీ పేసర్ 61 ఏళ్ల డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ అరుదైన మోటార్ న్యూరాన్ జబ్బుతో మరణించాడు. దీంతో అతడికి నివాళిగా ఆదివారం ఆటలో భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ చేతులకు నల్ల బ్యాడ్జీలు ధరించి బరిలోకి దిగారు. ఇంగ్లండ్ తరఫున 1988-1992 మధ్యకాలంలో డేవిడ్ ఐదు టెస్టుల్లో 18, ఒక వన్డేలో 4 వికెట్లు తీశాడు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (సి) కరుణ్ (బి) బుమ్రా 4; డకెట్ (బి) బుమ్రా 62; పోప్ (సి) పంత్ (బి) ప్రసిద్ధ్ 106; రూట్ (సి) కరుణ్ (బి) బుమ్రా 28; బ్రూక్ (సి) శార్దూల్ (బి) ప్రసిద్ధ్ 99; స్టోక్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; స్మిత్ (సి) సాయి సుదర్శన్ (బి) ప్రసిద్ధ్ 40; వోక్స్ (బి) బుమ్రా 38; కార్స్ (బి) సిరాజ్ 22; టంగ్ (బి) బుమ్రా 11; బషీర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 34; మొత్తం: 100.4 ఓవర్లలో 465 ఆలౌట్. వికెట్ల పతనం: 1-4, 2-126, 3-206, 4-225, 5-276, 6-349, 7-398, 8-453, 9-460, 10-465; బౌలింగ్: బుమ్రా 24.4-5-83-5; సిరాజ్ 27-0-122-2; ప్రసిద్ధ్ 20-0-128-3; జడేజా 23-4-68-0; శార్దూల్ 6-0-38-0.
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) కార్స్ 4; రాహుల్ (బ్యాటింగ్) 47; సాయి సుదర్శన్ (సి) క్రాలే (బి) స్టోక్స్ 30; గిల్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు: 3 మొత్తం: 23.5 ఓవర్లలో 90/2. వికెట్ల పతనం: 1-16, 2-82; బౌలింగ్: వోక్స్ 6-2-18-0; కార్స్ 5-0-27-1; టంగ్ 5-0-15-0; బషీర్ 2.5-1-11-0; స్టోక్స్ 5-1-18-1.