Share News

Rishabh Pant: పంత్‌పై ఐసీసీ బ్యాన్.. తప్పంతా అతడిదే!

ABN , Publish Date - Jun 23 , 2025 | 02:16 PM

టీమిండియా నయా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చిక్కుల్లో పడ్డాడు. లీడ్స్ టెస్ట్‌లో ఫీల్డ్ అంపైర్‌తో అతడు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.

Rishabh Pant: పంత్‌పై ఐసీసీ బ్యాన్.. తప్పంతా అతడిదే!
Rishabh Pant

టీమిండియా నయా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అనవసర చిక్కుల్లో పడ్డాడు. లీడ్స్‌ టెస్ట్‌ మూడో రోజు ఆటలో ఆన్ ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్‌తో గొడవకు దిగాడు పంత్. బంతి పాతగా మారింది.. దాని స్థానంలో కొత్త బంతి ఇవ్వమంటూ అంపైర్‌తో వాదనకు దిగాడు రిషబ్. అయితే ఆ బంతి ఆకారాన్ని చెక్ చేసిన పాల్ రీఫెల్.. కొత్త బంతి ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో ఎందుకు ఇవ్వవంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు భారత వైస్ కెప్టెన్. ఆ తర్వాత కోపంతో బాల్‌ను కిందకు విసిరేశాడు. పంత్ కోపంలో అలా చేశాడని చాలా మంది ఈ ఘటనను తేలిగ్గా తీసుకున్నారు. అయితే ఐసీసీ మాత్రం అతడిపై చర్యలకు సిద్ధమవుతోందని తెలిసింది.


శిక్ష తప్పదా?

అంపైర్‌తో వాదులాట వల్ల ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని రెండు నిబంధనల్ని పంత్ ఉల్లంఘించాడని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించకపోవడం, అసహనాన్ని ప్రదర్శించడం.. అలాగే అంపైర్‌ డెసిషన్‌పై వాదులాటకు దిగడం నేరమని చెబుతున్నారు. అంపైర్, ప్లేయర్, మ్యాచ్ రిఫరీ లేదా సపోర్ట్ స్టాఫ్.. ఇలా ఎవరి ముందైనా బంతిని లేదా వాటర్ బాటిల్‌ను కావాలని విసిరినా, ప్రమాదకరంగా త్రో చేసినా ఆర్టికల్ 2.9 కింద నేరంగా పరిగణిస్తారు. మ్యాచ్ ముగిసిన తర్వాత దీనిపై మ్యాచ్ రిఫరీ విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.


సారీ చెప్పినా..

ఒకవేళ పంత్ తప్పు చేసినట్లు తేలితే అతడికి జరిమానా లేదా ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించే చాన్స్ ఉందని తెలుస్తోంది. రిషబ్ అనవసరంగా అంపైర్‌తో వాదులాట దిగాడని.. ఒకవేళ బ్యాన్ విధిస్తే అది టీమిండియాకు ప్రమాదకరమని, జట్టు విజయావకాశాల మీద ప్రభావం పడుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనవసరంగా పీకల మీదకు తెచ్చుకుంటున్నాడని.. తప్పు ఒప్పుకొని సారీ చెబితే సేఫ్ అయ్యే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అయితే క్షమాపణలు చెప్పినా బ్యాన్ తప్పదని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి.


ఇవీ చదవండి:

చాన్సిస్తే కోచ్‌గా పనిచేస్తా

సంబరాల నిబంధనలు కఠినతరం

పురుషుల జట్టుకు టీమ్‌ టైటిల్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 23 , 2025 | 02:16 PM