Share News

Yanamala: రెవెన్యూ రికవరీ చట్టం తెచ్చి జగన్ దోచిన రూ.3500 కోట్లు వసూలు చేయాలి: యనమల

ABN , Publish Date - Jul 21 , 2025 | 01:28 PM

ప్రజలను మోసం చేసి మద్యం కుంభకోణంలో జగన్ దోచుకున్న రూ.3500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి ప్రభుత్వానికి సూచించారు. రెవెన్యూ రికవరీ చట్టం లేదా కొత్త చట్టం తీసుకొచ్చి జగన్ కాజేసిన సొమ్మును ప్రభుత్వం వసూలు చేయాలని అన్నారు.

Yanamala: రెవెన్యూ రికవరీ చట్టం తెచ్చి జగన్ దోచిన రూ.3500 కోట్లు వసూలు చేయాలి: యనమల
Yanamala Ramakrishnudu on Jagan liquor scam

అమరావతి: ప్రజలను మోసం చేసి మద్యం కుంభకోణంలో జగన్ దోచుకున్న రూ.3500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఈ భారీ స్కాంలో మిథున్ రెడ్డిది మాస్టర్ మైండ్ అయితే, ప్రధాన లబ్ధిదారుడు జగనే అని అన్నారు. అందుకే రెవెన్యూ రికవరీ చట్టం లేదా కొత్త చట్టం తీసుకొచ్చి జగన్ కాజేసిన సొమ్మును ప్రభుత్వం వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. హత్య చేసే వ్యక్తి కంటే ఆర్థిక నేరస్థుడు చాలా ప్రమాదకరమని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.


జగన్ అవినీతి వల్లే రాష్ట్రం అప్పులపాలు..

'ఇది కక్షపూరిత కేసని వైసీపీ నేతలు చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. నేరం నుంచి తప్పించుకునేందుకే ఇలాంటి మాటలు చెబుతున్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్ తీవ్రమైన ఆర్థిక నేరాలు చేశాడు. తాను ముఖ్యమంత్రి అయ్యాక విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డాడు. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మింగేసి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆ డబ్బు ప్రభుత్వ ఖాజానాలో ఉండి ఉంటే అప్పులు చేయవలసిన అవసరం వచ్చేది కాదు. జగన్ హయాంలో అతడి అనుచరుల్లో చాలామంది అవినీతి చేసి బిలీనియర్లయ్యారు. రాష్ట్రం మాత్రం అప్పుల పాలైంది' అని యనమల పేర్కొన్నారు.


అందరికీ శిక్ష పడుతుంది..

ఎంపీ మిథున్ రెడ్డిని రూ.3,500 కోట్ల రూపాయల భారీ మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నందుకే అరెస్టు చేశారు. విభీషణుడు తప్ప రావణుడి అనుచరులంతా అతడి తప్పులు అనైతిక ప్రవర్తనను గుడ్డిగా అనుసరించడం వల్ల శిక్ష అనుభవించారు. తప్పుడు మార్గాన్ని అనుసరించే వాళ్ల శిక్ష నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు. జగన్ అతడి అనుచరులు కూడా అదే తరహాలో శిక్ష అనుభవిస్తారని యనమల స్పష్టం చేశారు.


Also Read:

అజ్ఞాతంలోకి పేర్ని నాని.. గాలిస్తున్న పోలీసులు..

విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి

For More Andhra Pradesh News

Updated Date - Jul 21 , 2025 | 01:53 PM