Share News

Minister Satyakumar: జగన్ హయాంలో ఆరోగ్య రంగం పూర్తిగా క్షీణించింది: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - Jul 15 , 2025 | 01:48 PM

ఏపీలో ఓపీ, ఐపీ సేవలు భారీగా పెరిగాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సూపర్ స్పెషాలిటీలో 59శాతం వేకెన్సీలు ఉన్నాయని చెప్పారు. టెలి మానస్‌లో భాగంగా మానసిక కౌన్సెలింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు

Minister Satyakumar: జగన్ హయాంలో ఆరోగ్య రంగం పూర్తిగా క్షీణించింది: మంత్రి సత్యకుమార్
Minister Satyakumar Yadav

విశాఖపట్నం: సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో ఏపీలో వైద్యరంగంలో సంస్కరణలు తెచ్చామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ. 2 వందల కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉన్న గత జగన్ ప్రభుత్వంలో కేవలం రూ.38 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని చెప్పుకొచ్చారు. ఇవాళ(మంగళవారం) విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్‌లోని ఏకడమిక్ బ్లాక్‌ను, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, కూటమి నేతలు, వైద్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడారు.


2020లో నేషనల్ హెల్త్ అర్బన్ 15వ ఫైనాన్స్ కమిషన్ కింద 520 యూపీహెచ్సీలు మంజూరు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుత యూపీహెచ్సీని కోటి 50 లక్షల రూపాయలతో నిర్మించామని తెలిపారు. విశాఖకి 48 యూపీహెచ్ఎల్‌లు మంజూరయ్యాయని వివరించారు. స్టేట్ క్యాన్సర్ సెంటర్ 2018లో మంజూరయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. సంవత్సరంలో ఏడు కోట్ల 48 లక్షల ఓపీలు నమోదు అవుతున్నాయని వెల్లడించారు. గత సంవత్సర కాలంగా 17శాతం ఐపీ సేవలు పెరిగాయని... 7శాతం డయగ్నోస్టిక్ టెస్టులు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో ఓపీ, ఐపీ సేవలు భారీగా పెరిగాయని అన్నారు. సూపర్ స్పెషాలిటీలో 59శాతం వేకెన్సీలు ఉన్నాయని చెప్పారు. టెలి మానస్‌లో భాగంగా మానసిక కౌన్సెలింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.


గత జగన్ ప్రభుత్వం పేదల వైద్యాన్ని విస్మరించిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు ఎలాంటి నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. జగన్ హయాంలో ఆరోగ్య రంగం పూర్తిగా క్షీణించిందని ఆరోపించారు. గత జగన్ ప్రభుత్వంలో భూమిని ఆక్రమించి పార్టీ ఆఫీసులు నిర్మించుకున్నారని.. కానీ పేదల కోసం ఎలాంటి ఆస్పత్రి నిర్మాణాలు చేపట్టలేదని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం సహాయం చేసినప్పటికీ ఆస్పత్రుల కోసం చర్యలు తీసుకోలేదని.. కానీ వారి సొంతంగా నివాసం ఉండటానికి రుషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో జగన్ ప్రభుత్వ విధానం వల్ల సైకాలజిస్ట్‌ల కొరత ఏర్పడిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జగన్ పరామర్శల యాత్రల పేరుతో దండయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో జగన్ వికృతమైన చేష్టలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సొంత కార్యకర్తల ప్రాణాలను పణంగా పెట్టి దాడులను ప్రోత్సహిస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం

మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2025 | 01:58 PM