Minister Ravi Kumar: విద్యుత్ చార్జీలపై మంత్రి గొట్టిపాటి క్లారిటీ
ABN , Publish Date - Jun 27 , 2025 | 05:24 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీ వ్యాప్తంగా విద్యుత్ శాఖలో 180 మందికి కారుణ్య నియామకాలు చేశామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఏపీలో విద్యుత్ కనెక్షన్ లేని గృహం ఉండకూడదని సీఎం చంద్రబాబు తనను ఆదేశించారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.

విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (Minister Gottipati Ravi Kumar) స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వం ప్రజలపై తొమ్మిది సార్లు విద్యుత్ భారాలు మోపిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లోపు వీలైనంత వరకు విద్యుత్ చార్జీలు తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇవాళ(శుక్రవారం) విశాఖపట్నంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. 24 గంటల పాటు గ్రీన్‌ఎనర్జీని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఉద్ఘాటించారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్.
రూ.14 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో సూపర్ ఈసీబీసీ భవనాన్ని నిర్మించి ప్రారంభించామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ భవనం 50 శాతం వరకు విద్యుత్ ఆదా చేస్తోందని అన్నారు. సూపర్ ఈసీబీసీ భవనంలో విద్యుత్ ఉద్యోగుల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ శిక్షణ కేంద్రం దేశంలోనే గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీవ్యాప్తంగా విద్యుత్ శాఖలో 180 మందికి కారుణ్య నియామకాలు చేశామని వెల్లడించారు. ఏపీలో విద్యుత్ కనెక్షన్ లేని గృహం ఉండకూడదని సీఎం చంద్రబాబు తనను ఆదేశించారని అన్నారు. మారుమూల గిరిజన తండాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
విద్యుత్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాలి: గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న ప్రజలంటే సీఎం చంద్రబాబుకి అత్యంత ప్రేమ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విద్యుత్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ప్రభుత్వ సీఎస్‌ను కోరారు. భీమిలి ప్రాంతానికి టీసీఎస్, గూగుల్ ఇలా అనేక ఐటీ కంపెనీలు రానున్నాయని తెలిపారు. హౌసింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని అన్నారు. భవిష్యత్తులో యూనిట్ ఛార్జి మరింత తగ్గొచ్చని చెప్పారు. ఈసీబీసీ భవనం తమ భీమిలి ప్రాంతంలో ఉండటం చాలా అదృష్టమని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
AP Tourism: పర్యాటక రంగం.. సీఎం సూచనలతోనే ముందుకు: మంత్రి దుర్గేష్
సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్
Read Latest AP News And Telugu News