Share News

Nara Lokesh: దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ: మంత్రి నారా లోకేష్

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:07 AM

ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామని స్పష్టం చేశారు.

Nara Lokesh: దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ: మంత్రి నారా లోకేష్
AP Minister Nara Lokesh

విశాఖపట్నం ,నవంబరు14 (ఆంధ్రజ్యోతి): దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ, ఏపీకి గ్రోత్ కారిడార్‌గా విశాఖపట్నం తయారవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ఇవాళ(శుక్రవారం) విశాఖపట్నంలోని సీఐఐ పెట్టుబడుల సదస్సులో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని ఉద్ఘాటించారు.


ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడితే వాటిని ప్రభుత్వ పెట్టుబడులుగా భావించి వారందరికీ అండగా నిలుస్తున్నామని మాటిచ్చారు. 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సహకరిస్తున్నారని మంత్రి నారా లోకేష్, పేర్కొన్నారు.


ఎయిర్ క్రాఫ్ట్ తయారీని కూడా ఏపీకి తీసుకువస్తాం: రామ్మోహన్ నాయుడు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి విజనరీ లీడర్ల నేతృత్వంలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా ఏపీలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని ఉద్ఘాటించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం అవుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏడు ఆపరేషన్ ఎయిర్ పోర్టులు ఉన్నాయని.. కొత్తగా మరో ఏడు ఎయిర్ పోర్టులు నిర్మాణం చేస్తామని వివరించారు. ఏరోస్పేస్, ఎయిర్ క్రాఫ్ట్ తయారీని కూడా ఏపీకి తీసుకువస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


ఏపీలో పరిశ్రమల పండగ :మంత్రి సవిత

ఏపీలో పరిశ్రమల పండగ జరుగుతోందని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు అంటేనే నమ్మకం, అభివృద్ధి అని ఉద్ఘాటించారు. సీఎం, మంత్రి లోకేష్ కృషి కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. ఇవాళ(శుక్రవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి సవిత మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతల బెదిరింపుల కారణంగా ఎన్నో పరిశ్రమలు ఏపీని విడిచి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ అన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని నొక్కిచెప్పారు. రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై నమ్మకతోనే పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని వివరించారు. మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఏపీలో అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చేది చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, కూటమి నేతలేనని మంత్రి సవిత పేర్కొన్నారు.


పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

విదేశాల నుంచి వస్తున్న ప్రతినిధులకు రవాణాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ(శుక్రవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి మండిపల్లి మాట్లాడారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సీఐఐ సమ్మిట్ వరకు జాగ్రత్తగా విదేశీ ప్రతినిధులను తీసుకువస్తున్నామని వివరించారు. సీఎం చంద్రబాబుకు ఉన్న బ్రాండ్‌కు మంత్రి నారా లోకేష్ శక్తి తోడవడంతో పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారని ఉద్ఘాటించారు. ఏపీ అన్ని రాష్ట్రాల కంటే పెట్టుబడులకు సురక్షితమైన ప్రదేశమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అతిథులకు ఆహ్వానం పలుకుతూ సీఎం ట్వీట్

విశాఖలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 14 , 2025 | 11:12 AM