Share News

Anitha: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై హోంమంత్రి అనిత వార్నింగ్

ABN , Publish Date - Jul 11 , 2025 | 02:39 PM

గత జగన్ పాలనలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా ఏరులై పారేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. గంజాయి కేసుల్లో పట్టుబడితే సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నామని ఉద్గాటించారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చుదామని దిశానిర్దేశం చేశారు. విద్యరంగానికి తమ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తోందని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు.

Anitha: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై హోంమంత్రి అనిత వార్నింగ్
AP Home Minister Anitha

అనకాపల్లి జిల్లా: సోషల్ మీడియాలో అభ్యంతరకర, తప్పుడు పోస్టులు పెడితే, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Anitha) స్పష్టం చేశారు. పిల్లలు సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని కోరారు. ఆడ, మగ అని తేడా ఉండకూడదని.. తల్లిదండ్రులు ఇద్దరిని సమానంగా చూడాలని సూచించారు హోంమంత్రి అనిత.


తాను ఒకప్పుడు టీచర్‌ని అని చెప్పడానికి గర్వంగా ఉంటుందని హోంమంత్రి అనిత ఉద్ఘాటించారు. మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి చదువు అని చెప్పుకొచ్చారు. ఇవాళ(జులై11, శుక్రవారం) నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హోం మంత్రి అనిత హాజరయ్యారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను హోం మంత్రి అనిత సన్మానించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత ప్రసంగించారు. కనిపించే దేవత అమ్మ.. అమ్మను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని సూచించారు. విద్యను మించిన ఆస్తి లేదని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో తల్లిదంద్రులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.


ఇప్పుడు తమ ప్రభుత్వంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్‌లో మాత్రమే పేరెంట్ - టీచర్స్ మీటింగ్స్ జరిగేవని వెల్లడించారు. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో పేరెంట్ - టీచర్స్ మీటింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మధ్యాహ్న భోజన పథకం, హాస్టల్స్‌లో సన్నబియ్యం ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు హోంమంత్రి అనిత.


గత జగన్ పాలనలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా ఏరులై పారేదని హోంమంత్రి అనిత ఆరోపించారు. గంజాయి కేసుల్లో పట్టుబడితే సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నామని ఉద్ఘాటించారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చుదామని దిశానిర్దేశం చేశారు. విద్యని తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని చెప్పుకొచ్చారు. ఆ చదువే తనకు రాజకీయాల్లో పెట్టుబడి అయిందని వెల్లడించారు. గంజాయి మత్తులో పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలన్ని అమలు చేస్తున్నామని హోం మంత్రి అనిత ఉద్ఘాటించారు.


మోదకొండమ్మ అమ్మవారికి అనిత పూజలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. పాడేరులో హోంమంత్రికి ఎన్డీఏ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని దర్శించికొని, ప్రత్యేక పూజులు చేశారు. ఆలయ మర్యాదలతో అధికారులు హోం మంత్రికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనితకు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అధికారులు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా.. యువతకు ఆంధ్రజ్యోతి ఆహ్వానం

పీ-4 అమలుకు కీలక ప్రణాళికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 11 , 2025 | 04:02 PM