Cyclone Montha: మొంథా తుఫాను ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు
ABN , Publish Date - Oct 29 , 2025 | 08:58 PM
మొంథా తుఫాను ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో గురువారం పాఠశాలలకు, అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రకటించారు. మొంథా తుఫాను నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు.
విశాఖపట్నం జిల్లా, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మొంథా తుఫాను (Cyclone Montha) ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. కుండపోతగా వర్షం కురవడంతో వాగులు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లాలో రేపు(గురువారం) పాఠశాలల (Schools)కు, అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రకటించారు. మొంథా తుఫాను నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలకు (పదోతరగతి వరకు), అంగన్వాడీలకు రేపు సెలవు ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రకటించారు.
విశాఖలో బస్సులు రద్దు..
అలాగే, మొంథా తుఫాను ప్రభావం ఏపీఎస్ ఆర్టీసీపై పడిందని విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం రీజియన్‌లో 30 శాతం బస్సులు రద్దు చేశామని వెల్లడించారు. తుఫాను నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకి సెలవులు కాబట్టి.. కొన్ని బస్సులు రద్దు చేశామని చెప్పుకొచ్చారు. భారీ వర్షాల కారణంగా రోడ్ల మీదకు వరద వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బస్సులని జాగ్రత్తగా ఆర్టీసీ డ్రైవర్లు నడపాలని సూచించారు. రేపటి నుంచి విశాఖపట్నం రీజియన్‌లో పూర్తి స్థాయిలో బస్సులు నడిపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అప్పలనాయుడు వెల్లడించారు.
అనకాపల్లి జిల్లాలో..
అనకాపల్లి జిల్లాలో రేపు(గురువారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. విద్యాసంస్థల్లో మొంథా తుఫాను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వాసితులకు వసతి కల్పించిన కారణంగా జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించామని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు.
అల్లూరిజిల్లా పాడేరులో..
అల్లూరిజిల్లా పాడేరులో రేపు(గురువారం) ప్రైమరీ స్కూళ్లకు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సెలవు ప్రకటించారు. అయితే, అప్పర్ ప్రైమరీ హై స్కూల్స్ యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. జిల్లాలోని పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందజేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, రెడ్ గ్రామ్ పప్పు కేజీ, వంటనూనె లీటరు, ఉల్లిపాయలు కేజీ, బంగాళదుంపలు కేజీ, పంచదార కేజీలని ఏపీ ప్రభుత్వం ఇస్తుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకటించారు.
మచిలీపట్నంలో యథావిధిగా పాఠశాలలు..
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో రేపటి నుంచి యథావిధిగా పాఠశాలలని నిర్వహిస్తున్నట్లు డీఈఓ పీవీజే రామారావు తెలిపారు. మొంథా తుఫాను కారణంగా గత మూడు రోజులుగా పాఠశాలలకు సెలవులని ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని వివరించారు. తుఫాను తీరం దాటి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో రేపటి నుంచి యథావిధిగా పాఠశాలల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని డీఈఓ రామారావు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవి: మంత్రి సత్యకుమార్
మొంథా తుఫాను ప్రమాదం తప్పింది.. కానీ చాలా నష్టపోయాం..
Read Latest AP News And Telugu News