AP NEWS: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. పవన్, లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:55 PM
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఖండించారు. మహిళల జోలికి వస్తే వైసీపీ నేతలను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

అమరావతి: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే తాటతీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ (మంగళవారం) ఏపీ సచివాలయంలో మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకి ఒక అలవాటుగా మారిపోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.
ప్రసన్న మాటలకి సభ్యసమాజం సిగ్గుపడుతోందని పవన్ కల్యాణ్ అన్నారు. వ్యక్తిగత జీవితాలని లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం, మహిళలని కించపరచడాన్ని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని చెప్పారు. ప్రసన్న వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయని అన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్టప్రకారం కఠినంగా చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడూ వైసీపీ నేతలు నోటి దురుసుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. నిండు శాసనసభలో కూడా అదేవిధంగా మాట్లాడటంతో వైసీపీ నేతలకి ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారని గుర్తుచేశారు. అయినప్పటికీ నోటి దురుసు ఇంకా వదల్లేకపోతున్నారని ధ్వజమెత్తారు. మన సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
వైసీపీ నేతలకి మహిళలంటే ఇంత ద్వేషభావమా: మంత్రి నారా లోకేశ్
వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషభావమా అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ప్రశ్నించారు. పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదని.. మంచి నడవడిక కూడా ఉండాలని సూచించారు. మహిళలపై అభ్యంతరకర మాటలు మాట్లాడటానికి వైసీపీ నేతలకు కనీస ఇంగితజ్ఞానం కూడా లేదని ధ్వజమెత్తారు మంత్రి నారా లోకేష్.
మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం నేరం, దారుణమని హెచ్చరించారు. తల్లి, చెల్లిని తరిమేసిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మహిళల జోలికి వచ్చినా, ఆడవారిపై అవాకులు, చెవాకులు పేలినా ఊరుకునేందుకు ఇది జగన్ జంగిల్ రాజ్ కాదని వార్నింగ్ ఇచ్చారు. మహిళలకు అండగా నిలిచే ప్రజాప్రభుత్వం తమదని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం
Read latest AP News And Telugu News